telugu navyamedia
ఆంధ్ర వార్తలు

యుద్ధం చేయాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది: పవన్ కల్యాణ్

జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ శనివారం రాజ‌మండ్రిలో జ‌రిగిన బహిరంగ స‌భ‌లో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో రోడ్లపై గుంతలు ఏర్పడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని గాంధీ జయంతి సందర్భంగా శ్రమదానం కార్యక్రమానికి జనసేనాని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాజమండ్రి బాలాజీపేటలో శ్రమదానం కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ త‌న‌కు రాజ‌కీయాలంటే స‌ర‌దా కాద‌ని, ఒక బాధ్య‌త‌ అని అన్నారు.

అంద‌రినీ క‌లుపుకుని పోవాల్సిన అవ‌సరం ఉంద‌ని అన్నారు. క‌మ్మ‌ల‌కు వ్య‌తిరేకం కాద‌ని చెప్పేందుకే తాను 2014లో టీడీపికి మ‌ద్ధ‌తు ఇచ్చాన‌ని, అయితే, ఇప్పుడు టీడీపీ స‌త్తా స‌రిపోవ‌డం లేద‌ని, అందుకే తాను రంగంలోకి దిగాల్సి వ‌చ్చింద‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. బీజేపీ కార్య‌కర్త‌ల‌ను కూడా వైసీపీ నేత‌లు వ‌ద‌ల‌డంలేద‌ని అన్నారు. జనసైనికులపై దాడులు చేస్తున్నారు. వైసీపీ దేనికంటే దానికి సై అంటూ ఛాలెంజ్ విసిరారు. యుద్ధం చేయాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని, ఈ యుద్ధంలో తాను చ‌నిపోతే దేశం న‌లుమూల‌లా పిడికెడు మ‌ట్టి వేయాల‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు.

వైసీపీకి అధికారం ఇస్తే కులాలను కుళ్ల బొడుస్తోంది. యువత వైసీపీకి ఓటువేసింది. వైసీపీ ఇప్పటివరకు ఉద్యోగాలు ఇవ్వలేదని, పరిశ్రమలు రాలేదని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు కావాలి, రెండువేలు, ఐదు వేలు ఇస్తామంటే కుదరదు అన్నారు. ప్ర‌భుత్వం జ‌న‌సైనికుల‌ను అడ్డుకోకుంటే సుమారు ల‌క్ష‌మందితో స‌భ జ‌రిగేద‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుందని, ఆ హక్కును ఎవరూ ఆపలేరని అన్నారు. కుల, మత, వర్గ రహిత సమాజం నిర్మించడమే తన ఆకాంక్ష అన్నారు.

రాజకీయ సాధికారత కోసం పోరాటం చేస్తున్నా. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు అండగా ఉండాలని వచ్చానని తెలిపారు. అన్నీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. మనం పన్నుల రూపంలో చెల్లించేది అంతా ప్రభుత్వ ఖజానాకు వెళ్తుందని. ప్రభుత్వం వద్ద డబ్బులున్నాయని అన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. యాక్షన్, కెమెరా, కట్ అని వెళ్లే వ్యక్తిని కాదని, పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదని అన్నారు. ప్రజల కోసమే తిట్లు భరిస్తున్నాని, నాకోసమే ఆలోచించే వాడినయితే తిట్టినవారిని కింద కూర్చోబెట్టి నార తీసేవాడినని హెచ్చరించారు. ఇంతకాలం మానసిక అత్యాచారాలు భరించాను, ఎన్నో మాటలు పడ్డా.. నా సహనాన్ని తేలిగ్గా తీసుకోవద్దు అన్నారు. ఒక కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించడం సరికాదన్నారు.

ఒకరు అన్నారని కులాన్ని నిందించకూడదు, కులంలో చాలా గొప్పవాళ్లు ఉంటారని అన్నారు. కులాల కొట్లాటలతో ప్రజలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో అణచివేత శ్రేయస్కరం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే కాపు, బలిజ, తెలగ, ఒంటరిలు ముందుకు రావాలని అన్నారు. కమ్మలకు జనసేన వ్యతిరేకం కాదని చెప్పేందుకే టీడీపీకి మద్దతిచ్చామని అన్నారు. సమాజంలో మార్పు అనేది గోదావరి జిల్లాలపై ఆధారపడి ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన విజయ ఢంకా మోగించబోతుందని అన్నారు. జనసేన అంటే వైసీపీకి భయం అని పవన్ కల్యాణ్ అన్నారు. అందుకే సభకు వచ్చేవారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారని మండిపడ్డారు. 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. పోతే ప్రాణం పోవాలి.. కానీ పారిపోయేది లేదని స్పష్టం చేశారు. రాయలసీమలో కోపాన్ని 3 తరాలు దాచుకుంటారని, కోపాన్ని దాచుకునే కళను అందరూ నేర్చుకోవాలని అన్నారు.

Related posts