telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కేసుల మాఫీ కోసమే జగన్ ఢిల్లీ పర్యటనలు.. రాష్ట్ర ప్రయోజనాలకు కాదు.. : పవన్ కళ్యాణ్

pavan strong warning to tdp

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. నేడు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కేసుల భయం పట్టుకుందని ఆరోపించారు. తనపై కేసులు ఉన్నాయనే సీఎం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడుతున్నారని మండిపడ్డారు. అందుకే ఢిల్లీలో కేంద్రమంత్రుల దగ్గర రాష్ట్ర ప్రాజెక్టుల గురించి బలంగా మాట్లాడలేకపోయారని అన్నారు. కోడి కత్తి కేసు సహా సొంత చిన్నాన్న కిరాతకంగా హత్యకు గురైతే ఇప్పటికీ ఏమీ తేల్చలేకపోయారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారూ అప్పుడు ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ సీబీఐకి కేసు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. మరి ఇప్పుడు ఆ దిశగా ఎందుకు వెళ్లలేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల కష్టాలపై నవంబర్ 3న విశాఖపట్నంలో నిర్వహించనున్న ఛలో విశాఖ కార్యక్రమం పోస్టర్‌ను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఒంగోలులో జరిగిన సమావేశంలో పార్లమెంట్ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. పార్టీని బలోపేతం చేయడానికి మండల, పట్టణ, గ్రామ స్థాయిలో కమిటీలను నియమిస్తామని నాదెండ్ల మనోహర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని జగన్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధం కావాలన్నారు నాదెండ్ల మనోహర్.

Related posts