అనధికారికంగా అమెరికాలో ప్రవేశించి, ఇమిగ్రేషన్ అధికారుల అదుపులో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైన న్యాయసహాయం అందించి విడుదల చేయించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలను తక్షణం తీసుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ కోరారు. శుక్రవారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ ఆ దేశానికి ఎంఎస్ చదివేందుకు వెళ్లి కేసుల్లో చిక్కుకోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. అరెస్టు అయిన వారిలో ఎక్కువమంది తెలుగు వారు ఉన్నారనే వార్తలు బాధను కలిగిస్తున్నాయన్న పవన్.
అమెరికా ప్రభుత్వమే మిషిగన్ రాష్ట్రంలో నకిలీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి, అందులో చేరిన విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం విచారకరమని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఇబ్బందులుపడుతున్న విద్యార్థులకు అవసరమైన సాయాన్ని అందించాలని ఎన్‌ఆర్‌ఐ జనసేన ప్రతినిధులను ఆయన విజ్ఞప్తి చేశారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కళాశాల దశనుంచే అవగాహన శిబిరాలను నిర్వహించాల్సిన బాధ్యతను విద్యాశాఖతో పాటు కళాశాలలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉంటే నకిలీ వీసాలు పొంది, ఇమ్మిగ్రేషన్ రూల్స్‌ను ఉల్లంఘించిన 130మంది విదేవీ విద్యార్థులను అరెస్టు చేసినట్లు ఐసిఈ ప్రతినిధి కారిసా కట్రెల్ తెలిపారు. అరెస్టుల సంఖ్య మున్ముందు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అందులో తెలుగువారే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధిత విద్యార్థులు హోమ్ లాండ్ సెక్యూరిటీ అధికారులతో మాట్లాడవచ్చని అమెరికా అధికారులు తెలిపారు. అయితే అరెస్టయిన తెలుగు విద్యార్థుల కోసం న్యాయ సహాయం చేస్తామని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఛైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్ ప్రకటించారు. విద్యార్థులను విడిపించేందుకు న్యాయనిపుణుడు జొన్నలగడ్డ శ్రీనివాస్‌తో చర్చిస్తున్నామన్నారు. అరెస్టుల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదని మరో సమావేశంలో ఎపి ఎన్‌ఆర్‌టి అధ్యక్షుడు వేమూరి రవికుమార్ స్పష్టం చేశారు.