telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

తెలుగు సినిమాకు స్ఫూర్తి ప్రదాత డివిఎస్ రాజు.

మానవత్వం, మనిషి తత్త్వం మూర్తీభవించిన మహనీయ వ్యక్తులు ఎప్పుడు స్ఫూర్తి ప్రదాతలుగా మిగిలిపోతారు .
చదువు, సంస్కారంతో పాటు సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తికి అదే భావన, సేవాగుణం కలిగిన వ్యక్తి తోడైతే .. ? ఆ అనుబంధం ఆ మానవతా గుణం చిరస్మరణీయమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని చెప్పవచ్చు. అలాంటి మహనీయులే పద్మశ్రీ ఎన్ .టి రామారావు, పద్మశ్రీ డివిఎస్ రాజు.

ఎన్ .టి .రామారావు గారికి అంత్యంత ఆప్తులు, ఆత్మీయ సోదరుడు డివిఎస్ రాజు గారు. నిర్మాతగా, లితో ప్రెస్ అధినేతగా, సమాజ సేవకుడిగా, మంచి పాలనా దక్షులుగా డివిఎస్ పేరు సంపాదించారు. తెలుగు సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదిగి, ఆ రంగాన్ని అభివృద్ధి పధంలో నడిపించిన వారిలో నిస్సందేహంగా డివిఎస్ రాజు ముందు వుంటారు. ఈరోజు డివిఎస్ రాజు 96వ జయంతి. ఈ సందర్భంగా రాజు గారిని స్మరించుకుందాం.

1952వ సంవత్సరం లో రామారావు గారు నేషనల్ ఆర్ట్స్ అనే స్వంత నిర్మాణ సంస్థ ను ప్రారంభించి టి. ప్రకాష్ రావు దర్శకత్వంలో “పిచ్చి పుల్లయ్య ” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సంగీత దర్శకుడు, ఎన్ .టి .ఆర్ కు రూమ్మేట్ అయిన టి.వి .రాజు, సినీ లితో ప్రింటింగ్ ప్రెస్ అధినేత డివిఎస్ రాజును రామారావు గారికి పరిచయం చేశారు.

ఏ అమృత ఘడియల్లో వారిద్దరూ కలుసుకున్నారో, ఆ వేళా విశేషం వారిద్దరి మధ్య తెలియని అనుబంధం, ఆత్మీయ భావం పెనవేసుకుపోయాయి. రామారావు గారికి తమ్ముడు త్రివిక్రమరావు అంటే అమితమైన అభిమానం, ప్రేమ. డివిఎస్ రాజును కూడా రామారావు స్వంత తమ్ముడులా అభిమానించి , ఆదరించారు , ప్రోత్సహించారు.

ఆ సినిమా తరువాత మరో సినిమా నిర్మించే ఆలోచనతో వున్న రామారావు తన తమ్ముడు త్రివిక్రమ రావుతో డివిఎస్ రాజుకు కబురు చేశారు. అప్పటికే రాజు వ్యకిత్వం రామారావు కు బాగా నచ్చింది. అందుకే తాము నిర్మించే రెండవ సినిమాలో భాగస్వామి గా చేరమని ఆహ్వానించారు. అలాంటి అవకాశం, అదృష్టం వస్తుందని ఆయన ఊహించలేదు. అది దేవుని మహా ప్రసాదంగా భావించారు. అదే “తోడు దొంగలు” సినిమా.

అదే సమయంలో రాయలసీమలో కరవు  విలయతాండవం చేస్తోంది . అక్కడి ప్రజలు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. నార్ల వెంకటేశ్వర రావు గారి సలహాతో రామారావు ప్రజలను ఆదుకోవాలని నిశ్చయించారు. ‘ఆంధ్రప్రభ – రాయలసీమ కరవు నివారణ నిధి’ పేరిట ఒక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన తమ్ముడు త్రివిక్రమ రావు, సోదరుడు డివిఎస్ రాజు సహకారంతో విరాళాలు సేకరించి ప్రజలకు అందించారు .

అది మొదలు రామారావు ఏది తలపెట్టినా డివిఎస్ వెన్నంటే ఉండేవారు. ఆ తరువాత స్వంత నిర్మాణ సంస్థను ప్రారంభించమని, తాము అండగా ఉంటామని రామారావు హామీ ఇచ్చారు. ఇది కూడా డివిఎస్ ఊహించలేదు. 1964లో డివిఎస్ ప్రొడక్షన్స్ సంస్థ ను రామారావే స్వయంగా ప్రారంభించడంతో పాటు తొలి సినిమాలో కథానాయకుడిగా నటించారు. అదే “మంగమ్మ శపథం”.

ఆ తరువాత డివిఎస్ ఆరోగ్యకరమైన, సందేశాత్మక చిత్ర నిర్మాణంతో పాటు రామారావు తో కలసి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. డివిఎస్ వ్యక్తిత్వం సినిమా రంగంలోని పెద్దలను ఆకట్టుకుంది. ఆయన నిజాయితీ, నిబద్దత, నిరాడంబర తత్త్వం, నిరుపమానమైన సేవా గుణం అనేక సంస్థల లో భాగస్వామిగా చేశాయి .

తెలుగు నిర్మాతల మండలి, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి, ఆంధ్ర ప్రదేశ్ చలన చిత్ర అభివృద్ధి సంస్థ, జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ , ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్, ఫిలిం నగర్ సహకార గృహ నిర్మాణ సంస్థలు నేటికీ విజయవంతంగా కొనసాగుతున్నాఅంటే అది డివిఎస్ సమర్ధత, పటిష్టమైన ప్రణాళికతో వేసిన బీజాలే .

1982లో డివిఎస్ జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థకు చైర్మన్ గా వున్నారు. రిచర్డ్ అటెన్‌బరో దర్శకత్వంలో మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మొదలైన భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రధాన నాయకుడు అయిన మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా నిర్మించారు .అదే “గాంధీ ” సినిమా. ఇది భారత దేశం మరియు బ్రిటన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం. ఈ చిత్ర లాభాల్లో కొంత భాగం భారతీయ సినిమా కార్మికుల కోసం ఇవ్వాలని డివిఎస్ పట్టుపట్టి మరీ సాధించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ .టి .రామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు డివిఎస్, రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థకు చైర్మన్ గా వున్నారు. అప్పుడు డివిఎస్ ఆధ్వర్యంలోనే తెలుగు లలిత కళా తోరణం రూపుదిద్దుకుంది. ఫిల్మోత్సవ్ 86ను అత్యంత సమర్ధవంతంగా , అనూహ్యంగా, అనితర సాధ్యంగా లలిత కళాతోరణంలోనే నిర్వహించారు. ఈ చిత్రోత్సవం లో అశోక్ కుమార్, రాజ్ కపూర్, ఎమ్ .జి .రామ చంద్రన్, కన్నడ రాజ్ కుమార్, ప్రేమ్ నజీర్ లాంటి హేమాహేమీలైన హీరోలు పాల్గొన్నారు.

తన సినిమాల , తన కుటుంబం, తన సంపాదన అని చూడకుండా భారతీయ సినిమా ప్రగతికి తోడ్పడిన వ్యక్తి డివిఎస్ రాజు.  రాజు గారి సేవలను గుర్తించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ .టి .రామారావు 1988లో రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించారు. 1995లో దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ డివిఎస్ .రాజు ను “సినీ భీష్మ” అవార్డుతో ఘనంగా సత్కరించింది.

2001వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. అప్పటి రాష్ట్రపతి కె .ఆర్. నారాయణన్ పద్మశ్రీ అవార్డు ను డివిఎస్ రాజుకు ప్రదానం చేశారు. 1928 డిసెంబర్ 13న తూర్పు గోదావరి జిల్లా అల్లవరం లో జన్మిచిన డివిఎస్ రాజు తన జీవన ప్రస్థానంలో చెరిగిపోని కీర్తిని సంపాదించి 2010 నవంబర్ 13న హైదరాబాద్ లో ఇహలోక యాత్ర ముగించారు.

డివిఎస్ రాజు గారు చరితార్థుడు .

– భగీరథ,
సీనియర్ జర్నలిస్ట్,

Related posts