telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మహానటి “సావిత్రి” గారి వర్ధంతిని (డిశంబర్ 6, 1936 – డిశంబర్ 26, 1981), పురస్కరించుకుని…

మహానటి సావిత్రి గారికి సన్నివేశములు వివరిస్తే చాలేమో..సంభాషణల రచయితకు ఏమాత్రము కష్టముండదేమో!! ఒకవేళ ఎంతటి బరువైన డైలాగ్ వ్రాసినా కూడా, ఆమె ముఖారవిందం ముఖ్యంగా ఆ కళ్ళు పలికించే హావభావ విన్యాసము ముందు ఎంతటి డైలాగు అయిన తేలిపోవాల్సిందే అన్న ఎరుకతో వుంటారు సంభాషణకర్తలు.

దటీజ్ సావిత్రి !! మూడు అక్షరాలు..రెండు కళ్ళు..పలికే భావనలు శతకోటి!! మహానటి క్లోజప్ షాట్స్ తీసే ఛాయాగ్రహకుడు ఈజీగా దర్శకుడు అయిపోవచ్చు అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదేమో! తెలుగు తమిళ అగ్ర కథానాయకులు నలుగురితో ఢీ అంటే ఢీ అంటూ నటించారామె!! ఈ అద్భుతాలలో ఎన్.టి.ఆర్ గారితో ఆ మహానటి కాంబినేషన్ ఎంతో ప్రత్యేకము.. సహజాతి సహజము!! ఒక అనిర్వచనీయమైన జీవకళ తొణికిసలాడుతుందీ వీరి జంటలో!!

మహానటుడు ఎన్టీఆర్ గారు, నటీ శిరోమణి సావిత్రి గారు కలిసి నటించిన కొన్ని చిత్రాలు… ప్రేమికులుగా “కార్తవరాయని కథ”, పడుచు దంపతులుగా “గుండమ్మకథ” (చీటికిమాటికీ అలిగే అంజి అలకలు తీర్చే అర్థాంగి), మధ్యవయస్కులైన ఆలుమగలుగా “విచిత్ర కుటుంబం” (ఎంత సహజాతి సహజంగా నటించారో సినిమాలో..”ఏమండీ! నిన్నొకావిడ మనల్ని చూసి ఏమందో తెలుసా..ఆయన మీ తమ్ముడా? అని అడిగిందండీ!” అంటూ వాపోయో అమాయకపు ఇల్లాలు, అనునయంగా నవ్వుకునే లాయర్ రాజశేఖరం గారు.. “ఈ వయసులో పద్దూ అంటూ ఆ ముచ్చట్లు ఏమిటో” అని అనుమానపడే భార్య.. “అయ్యో! పద్దు అంటే లాయర్ పద్మనాభమే.‌!” అంటూ సంజాయిషీ ఇచ్చే భర్త) ఇక చిన్నాన్న, కుమార్తెలు గా “మాయాబజార్”, (చిన్నాన్న అంటే ఏనుగెక్కినంత సంబర పడిపోయే చిట్టితల్లి శశిరేఖ) గడసరి గిరీశం, సొగసరి మధురవాణి లుగా “కన్యాశుల్కం”, నెగెటివ్ షేడ్స్ తో చంద్రహారం, కన్నబిడ్డలాంటి మరది, మాతృసమానురాలైన వదినమ్మ గా “ఉమ్మడి కుటుంబం”, “కోడలు దిద్దిన కాపురం” (రెండూ సూపర్ డూపర్ హిట్లే), అక్కాతమ్ముళ్ళుగా వరకట్నం.. ఇలా వీరిద్దరి ప్రతీ కాంబినేషన్ ప్రేక్షకాదరణ పొందటం విశేషం.

ఇక, అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి ఆనాటికీ ఈనాటికీ నిర్వచనంగా నిలిచిన “రక్తసంబంధం” చిత్రం లో పోటీపడ్డ వీరి నటనకు ప్రేక్షక లోకం నీరాజనం పలికింది. ఈ సినిమా లోని సన్నివేశాలు, వీరిద్దరి నటన గురించి చెప్పనవసరం లేదు, వీరి నటనకు ఆకాశమే హద్దు అన్న రీతిలో నటించి మెప్పించారు.

నర్తనశాలలో సైరంధ్రి, బృహన్నల సన్నివేశాలు నభూతో!! అభిమన్యుడు తొందరపాటుని మందలించే సందర్భంలో, “పోలిక మాత్రమే తల్లిది. బుద్ధులన్నీ తండ్రివే!” అన్నప్పుడు ఈమె చర్య, ఆయన ప్రతిచర్య వర్ణించడానికి మాటలు లేవు!! వాటే లవ్లీ కాంబినేషన్!! పద్మావతీ శ్రీవేంకటేశ్వరులుగా, సత్యాకృష్ణులుగా, ద్రౌపదీ భీమసేనులుగా ప్రేక్షకుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు ఈ మహా నటీ, నట ద్వయం!! ఒక హుందాతనం, ఒక తెలుగుదనం, ఒక గౌరవం ఉట్టిపడే కాంబినేషన్ అన్న ఎన్టీఆర్ గారు, సావిత్రమ్మ గారిది.

ఎన్టీఆర్ గారి దర్శకత్వంలో సావిత్రి గారు “వరకట్నం” చిత్రం లో నటించగా, సావిత్రి గారి దర్శకత్వంలో ఎన్టీఆర్ గారు “మాతృ దేవత” చిత్రం లో నటించారు. దక్షిణ భారతదేశ చలనచిత్ర రంగం లో సావిత్రమ్మ స్థాయిని అందుకోవడం మరెవరికీ సాధ్యం కానిపని!! ఆ మహానటి వర్ధంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులు అర్పిస్తూ.. !!

Related posts