telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పౌరాణిక మణిహారం ‘శ్రీకృష్ణ తులాభారము’

Srikrishna-tulabaram

కళాఖండాలు అనదగ్గ చిత్రాలు ఏ భాషలోనైనా కొన్ని మాత్రమే ఉంటాయి. అటువంటి చిత్రాలకు రూపకల్పన చేయడం కత్తి మీద సాము వంటిదే. ఆ సాహసం చేసిన పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరావు. ఆయన దర్శకత్వం నిర్వహించిన ముప్పై చిత్రాలలో దాదాపు 20 సినిమాలు పౌరాణికాలే. వాటిలో పాండురంగ మహత్త్యం, మహాకవి కాళిదాసు, నర్తనశాల, పాండవ వనవాసము, శకుంతల, శ్రీకృష్ణావతారం, వీరాంజనేయ, శ్రీకృష్ణవిజయం, బాలభారతం మచ్చుకు కొన్ని మాత్రమే. ‘మణిహారంలో సూత్రముంటుంది. కానీ అది పైకి కనిపించదు. ఆ సూత్రమే అన్ని మణులనూ కలిపి హారంగా రూపొందిస్తుంది. చిత్ర దర్శకుడు కూడా మణిహారంలోని సూత్రం లాంటివాడే’ అని నమ్మిన కమలార దర్శకత్వంలో మూవీ మెఘల్‌ దగ్గుబాటి రామానాయుడు నిర్మించిన మూడవ చిత్రం ‘శ్రీకృష్ణతులాభారము’. ఈ సినిమా ఆగస్టు 25, 1966న విడుదలై శతదినోత్సవం జరుపుకుంది.  54 సంవత్సరాలు పూర్తిచేసుకున్న శ్రీకృష్ణతులాభారము సినిమా విశేషాలు కొన్ని సితార డిజిటల్‌ పాఠకుల కోసం….

మూవీ మొఘల్‌ తొలి అడుగులు
తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అవసరంలేని పేరు దగ్గుబాటి రామానాయుడు. వ్యాపార నిమిత్తం మద్రాసులో అడుగుపెట్టి, గుత్తా రామినీడుతో ‘అనురాగం’ సినిమాకు భాగస్వామిగా నిలిచి పెట్టుబడి పోగొట్టుకున్న నాయుడు ‘ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే వెదుక్కోవాలి’ అనే సూత్రాన్ని నమ్మి పూర్తిస్థాయి నిర్మాతగా మారారు. నాలుగేళ్లుగా మోక్షం లేకుండా అటకపైవున్న నరసరాజు స్క్రిప్టును దుమ్ముదులిపి, వరుసగా తొమ్మిది ఫ్లాపు సినిమాలకు దర్శకత్వం నిర్వహించిన తాపి చాణక్యకు పగ్గాలు అప్పగించి, ఎన్టీఆర్‌తో కేవలం నాలుగు నెలల వ్వవధిలోనే ‘రాముడు-భీముడు’ అనే సంచలన చిత్రానికి పురుడు పోశారు. ఆ సినిమా పది కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఆ వెంటనే ‘శ్రీకృష్ణ తులాభారము’ సినిమా నిర్మాణం చేపడదామని ఎన్టీఆర్‌తో చర్చించారు. అయితే ఎన్టీఆర్‌ ‘వీరాభిమన్యు’ సినిమాలో శ్రీకృష్ణుని పాత్ర పోషిస్తున్నానని, కొంత గ్యాప్‌ ఇచ్చి సినిమా నిర్మిస్తే విజయవంతం అవుతుందని సలహా ఇచ్చారు. ఈలోగా ఒక చిన్న సినిమా తీసుకోమని కూడా సూచించారు. ఖాళీగా ఉండటం ఇష్టంలేని నాయుడు కొన్ని కాశీమజిలీ కథలను మధించి ‘ప్రతిజ్ఞాపాలన’ సినిమాకు రూపురేఖలు దిద్దారు. సి.ఎస్‌.రావు దర్శకత్వంలో కాంతారావు హీరోగా నటించిన ఈ సినిమా విజయాన్ని సాధించి లాభాలు ఆర్జించి పెట్టింది. ఒకే దర్శకుణ్ణి గాని, ఒకే రచయితనిగాని నమ్ముకొని నాయుడు ఎప్పుడూ సినిమాలు తీయలేదు. అదే ఆయన విజయ రహస్యం. మూడవ యత్నంగా ‘శ్రీకృష్ణ తులాభారము’ సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరావు దర్శకత్వంలో సముద్రాల రాఘవాచార్యతో కథ, మాటలు, పద్యాలు, కొన్ని పాటలు రచింపజేసి, పెండ్యాల సంగీత దర్శకత్వంలో ‘శ్రీకృష్ణ తులాభారము’ చిత్రాన్ని నిర్మించారు. దాశరిథి, శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు ఇతర పాటలను, పద్యాలను రచించారు.

Srikrishna-tulabaram

శ్రీకృష్ణ తులాభారము ఎందుకంటే..
రామానాయుడు ఎన్టీఆర్‌ అభిమాని. పౌరాణిక పాత్రల్లోని ఎన్టీఆర్‌ని ఆరాధించేవారు. ఆ రోజుల్లో మైలవరం కంపెనీ వారు ప్రదర్శించిన శ్రీకృష్ణ తులాభారము తెలుగునాట నాటకంగా బహుళ ప్రాచుర్యం సంతరించుకొని ఉంది. బందరు నోబుల్‌ కళాశాలలో అధ్యాపకునిగా ఉంటూ, శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని రచించి ప్రసిద్ధి కెక్కిన ముత్తరాజు సుబ్బారావు ఆంధ్ర రాష్ట్రమంతటా కొన్ని వందల ప్రదర్శనలు నిర్వహించారు. అందులో ఆకాశవాణిలో పనిచేసే స్థానం నరసింహారావు సత్యభామగా నటిస్తూ ‘మీరజాలగలడా నాయానతి వ్రత విధాన మహిమన్‌ సత్యావతి’ అంటూ సొంతంగా రాసుకొని పాట పాడి చర్రిత సృషించారు. అలాగే చందాల కేశవదాసు రాసిన ‘భలే మంచి చౌక బేరము’ పాట ఉర్రూతలూగించింది. 1935లో కలకత్తా కాళీ కంపెనీవారు నిర్మించిన శ్రీకృష్ణ తులాభారం సినిమాకు ముత్తరాజు సుబ్బారావు సినేరియో సమకూర్చారు. అందులో జయసింగ్‌ కృష్ణుడుగా, కపిలవాయి నారదుడుగా, ఋష్యేంద్రమణి సత్యభామగా, సభారంజని రుక్కిణిగా, కాంచనమాల మిత్రవిందగా నటించారు. ఈ సినిమా ద్వారానే రేలంగి, కాంచనమాల, ఋష్యేంద్రమణి, లక్ష్మీరాజ్యం వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా వచ్చిన ఇరవై ఏళ్ల తర్వాత 1955లో కడారు నాగభూషణం శ్రీకృష్ణ తులాభారం చిత్రాన్ని నిర్మిస్తూ అల్లుడు సి.ఎస్‌.రావును దర్శకునిగా పరిచయం చేశారు. ఇందులో ఈలపాట రఘురామయ్య, పి.సూరిబాబు, రేలంగి, ఎస్‌.వరలక్ష్మి, జూనియన్‌ శ్రీరంజని నటించారు. రావూరి మాటలు, దైతా గోపాలం పాటలు, పద్యాలు సమకూర్చారు. ఈ సినిమాల విజయాన్ని, నాటకానికి ఉన్న ప్రజాదరణను దృష్టిలో ఉంచుకొని రామానాయుడు ‘శ్రీకృష్ణ తులాభారము’ పేరుతో సినిమా నిర్మాణానికి పూసుకున్నారు. ముఖ్యంగా నంది తిమ్మన ప్రబంధం పారిజాతాపహరణం ఈ సినిమాకు మూలం.

Srikrishna-tulabaram

కథా సంగ్రహం…
నరకాసురుడు ఆది వరాహమూర్తికి, భూదేవికి జన్మించినవాడు. అతడు దేవతలకు తల్లిగా భాసించే అదితి కుండలాలను, వరుణుడి ఛత్రాన్ని, వారి విహార సాధనమైన మణిపర్వతాన్ని ఎత్తుకుపోతాడు. అతడి ఆగడాలు మితిమీరడంతో దేవతలు శ్రీకృష్ణభగవానుని వేడుకుంటారు. భగవానుడు సత్యభామా సమేతంగా యుద్ధానికి వెళ్లి, ఆమె చేత యుద్ధం చేయించి చివర్న సుదర్శన చక్రంతో నరాకాసుర సంహారం చేస్తాడు. నరకాసుర సంహారానంతరం సత్యభామలో గర్వం అతిశయిస్తుంది. నారద మహర్షి (కాంతారవు) అమరలోకం నుండి పారజాతపుష్పాన్ని తెచ్చి శ్రీకృష్ణునికి (ఎన్టీఆర్‌) బహూకరిస్తాడు. ఆ కుసుమాన్ని శ్రీకృష్ణుడు రుక్మిణి (అంజలీదేవి)కి ఇవ్వగా, సత్యభామ అలక వహిస్తుంది. ఆమె కోసం శ్రీకృష్ణుడు దేవలోకం వెళ్లి పారిజాత వృక్షాన్ని తెస్తాడు. దానితో సత్యభామ గర్వం హద్దులు మీరి, శ్రీకృష్ణుని ఎల్లెడలా తన సన్నిధిలో ఉండేలా చేసుకోవాలనుకుంటుంది. నారదుడు సత్యభామ చేత భర్తృదాన వ్రతాన్ని చేయించి శ్రీకృష్ణుని దానంగా పొందుతాడు. శ్రీకృష్ణుని బదులు అతనితో తూగగల ఐశ్వర్యాన్ని ఇచ్చి శ్రీకృష్ణుని తిరిగి పొందమని చెబుతాడు. శ్రీకృష్ణ తులాభారము మొదలవుతుంది. ఆ తులాభారంలో ఎంత సంపద సమర్పించినా శ్రీకృష్ణుని బరువుకు సరితూగదు. శ్రీకృష్ణుని నారదుడు వీధుల్లో అమ్మజూపుతాడు. సత్యభామ తను చేసిన పొరబాటుకు విచారిస్తుంది. నారదుని ఆదేశం మేరకు రుక్మిణీదేవి సహాయం అర్ధిస్తుంది. రుక్మిణీదేవి భక్తితో నమస్కరించి ఒక తులసీదళం త్రాసులో వేయగానే అది కృష్ణుని బరువుతో సరితూగుతుంది. శ్రీకృష్ణుడు సత్యానాథుడు కాదని, ఆ పరమాత్మ జగన్నాథుడని నారదుడు సత్యభామకు నిరూపించి సత్యభామ స్వాతిశయానికి కళ్ళెం వేస్తాడు. టూకీగా ఇదీ శ్రీకృష్ణ తులాభారము కథ. ఇందులో అష్ట భార్యలలో ఒకరైన జాంబవంతిగా కృష్ణకుమారి, మిత్రవిందగా అనూరాధ, లక్ష్మణగా విజయశ్రీ, ఇంద్రుని తల్లి అదితిగా ఋష్యేంద్రమణి, శచీదేవిగా ఎస్‌.వరలక్ష్మి, దేవకిగా నిర్మల, సత్యభామ ఇష్టసఖిగా వాణిశ్రీ, రుక్మిణి ఇష్టసఖిగా మీనాకుమారి, రంభగా ఎల్‌.విజయలక్ష్మి, ఇంద్రుడుగా రాజనాల, వసుదేవుడుగా మిక్కిలినేని, వసంతకుడుగా పద్మనాభం నటించారు.

Srikrishna-tulabaram

పెండ్యాల సంగీతం
ఈ సినిమాలో మొత్తం 36 పద్యాలు, పాటలు ఉన్నాయి అందులో సముద్రాల ఐదు పాటలు, పద్యాలూ రాశారు. ముత్తరాజు సుబ్బారావు, కేశవదాసు, స్థానం నరిసింహారావు పద్యాలు, పాటలు మినహాయిస్తే మిగతావి శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, కొసరాజు, పూరించారు. టైటిల్స్‌ ముగియగానే ‘జయహో జయ జయహో త్రిభువన మంగళ కారీ’ అనే పాట వస్తుంది. నరకాసురుని సంహరించి ద్వారకానగర ప్రవేశం చేస్తున్న శ్రీకృష్ణసత్యలకు స్వాగత గీతంగా దీనిని చిత్రీకరించారు. హంసధ్వని రాగంలో వచ్చే ఈ పాటను ఘంటసాల, సుశీల బృందం ఆలపించారు. ఇంద్రలోకానికి సత్యాసమేతంగా విచ్చేసిన శ్రీకృష్ణునికి స్వాగతం పలుకుతూ ఎల్‌.విజయలక్ష్మి నర్తించే ‘కొనుమిదే కుసుమాంజలీ.. అమరుల ప్రణయాంజలీ’ పాట ఖమాస్‌ రాగంలో ఒక జావళిని పోలి ఉంటుంది. దాశరథి రచించగా ఘంటసాల ఆలపించిన ‘ఓ చెలీ కోపమా అంతలో తాపమా’ పాట చివరిన వచ్చే నంది తిమ్మన పద్యం ‘నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిస్కబూని’ చిత్రానికే హైలైట్‌. ఇంద్రునికి, శ్రీకృష్ణునికి మధ్య జరిగే సంవాద పద్యాలను ఘంటసాల, మాధవపెద్ది ఆలపించారు. రుక్మిణీదేవి, సత్యభామలు ఆచరించే తులసీ, కల్పక వ్రతానికి సంబంధించిన ‘కరుణించవే తులసి మాతా…. కరుణించవే కల్పవల్లీ’ అనే సింధుభైరవి రాగంలో స్వరపరచిన పాటను సుశీల, లీల ఆలపించారు. ఇక ‘మీరజాలగలడా నాయావతి’ పాటను గురించి సుశీల ఆలపించిన విధాన్ని గురించి ఎంతచెప్పినా తక్కువే అవుతుంది. ఘంటసాల ఆలపించిన ‘భలే మంచి చౌక బేరము’ పాట కూడా అలాంటిదే. ఒక పద్యాల విషయానికొస్తే ఘంటసాల, మాధవపెద్ది పోటాపోటీగా పాడారు.

Srikrishna-tulabaram

సినిమా విశిష్టతలు
★ 1957లో విడుదలైన మాయాబజర్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ శ్రీకృష్ణుని పాత్ర పొషించడం ఈ సినిమాతో ఏడవసారి. అంతేకాదు పౌరాణిక బ్రహ్మగా కీర్తించే కమలాకర కామేశ్వరరావు కాంబినేషన్‌లో ఎన్టీఆర్‌ నటించడం పదకొండవసారి.

★ శ్రీకృష్ణ తులాభారము సినిమా షూటింగు వాహినీ స్టూడియోలో 1966, మార్చి 3న ప్రారంభించారు. రామానాయుడు పెద్ద కుమారుడు సురేష్‌బాబు కెమెరా స్విచాన్‌ చేయగా, నాగిరెడ్డి ఎన్టీఆర్‌ మీద తొలి షాట్‌కు క్లాప్‌ ఇచ్చారు. ఆరు నెలల్లోనే ఈ సినిమా నిర్మాణాన్ని పూర్తిచేసి విడుదలచేసిన ఘనత రామానాయుడిదే.

★ శ్రీకృష్ణ తులాభారం నాటకంలోని ముత్తరాజు సుబ్బారావు రచించిన పద్యాలను యధాతథంగా ఇందులో వాడుకున్నారు.

★ 1935లో వచ్చిన శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో రుష్యేంద్రమణి సత్యభామగా నటించారు. రామానాయుడు సినిమాలో ఆమె ఇంద్రుని తల్లి ‘అదితి’గా నటించారు. ఇంద్రలోకం సెట్లో జమున నటిస్తున్నప్పుడు ఆమె జమునకు నటనలో కొన్ని మెళకువలు నేర్పారు. జమున ఈ పాత్ర పోషణ కోసం పెద్ద అద్దం ఎదుట నిల్చుని అహోరాత్రాలు సత్యభామ హావభావాలకు రూపురేఖలు దిద్దుకున్నారు.

Srikrishna-tulabaram

★ సత్యభామ అలకపానుపు సన్నివేశం కోసం శ్రీకృష్ణునికి ‘ఓ చెలీ కోపమా అంతలో తాపమా’ అనే పాటను చేర్చారు. తనకు పారిజాత పుష్పం ఇవ్వలేదని అలిగిన సత్యభామను ఊరడించబోయి ఈ పాట చివరన నంది తిమ్మన రాసిన ‘నను భవదీయ దాసుని…’ అనే ప్రబంధ పద్యాన్ని జోడించారు. పద్యం పూర్తి అవుతుండగా శ్రీకృష్ణుడు సత్యభామ కాలివద్ద తలవంచుతాడు. సత్యభామ కాలు ఝాడించడంతో కృష్ణుని కిరీటం స్థానభ్రంశమౌతుంది. జమున చేత తన్నించుకోవడం ఏమిటని ఎన్టీఆర్‌ అభ్యంతరపెట్టలేదు. ఈ షాట్‌ తీయడానికి ముందు, ఆ తర్వాత కూడా జమున ఎన్టీఆర్‌ను క్షమాపణ వేడుకున్నారు. ఇదే పద్యాన్ని శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాలో కూడా వాడుకున్నారు. అందులో ఎస్‌.వరలక్ష్మి సత్యభామగా నటించడం విశేషం.

★ వినాయకచవితి (1957) సినిమాలో జమున తొలి సారి సత్యభామ వేషం ధరించారు. అందులో కేవలం ముగ్దత్వం మాత్రమే కనపడుతుంది. ఇందులో సత్యభామ సరస శృంగారాభిమానం, జాణతనం, అభిజాత్యం ప్రస్ఫుటంగా ప్రతిబింబింపజేశారు.

★ 1935, 1955, 1966 సంవత్సరాలలో వచ్చిన మూడు సినిమాలూ విజయవంతం అయ్యాయి. ఈ విజయం వెనుక గొప్ప కథాబలం, డ్రామా ఉండడం ముఖ్య కారణంగా చెప్పవచ్చు.

– ఆచారం షణ్ముఖాచారి

Related posts