ఈ దీపావళి పండగ సందర్భంగా భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతమైన వాఘా వద్ద మిఠాయిలు, బాణసంచా మార్పిడికి తెరపడనుంది. వాఘా సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద శాంతికి సంకేతంగా దీపావళి సందర్భంగా ప్రతి ఏటా ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ పాకిస్థాన్ లోని ముఖ్యులందరికీ మిఠాయిలు పంపిస్తుండటం ఆనవాయితీ. దీంతో పాటు వాఘా సరిహద్దుల్లోనూ భారత, పాకిస్థాన్ రేంజర్లు బీటింగ్ రిట్రీట్ వేడుకల్లో మిఠాయిలు, బాణసంచాను ఇచ్చి పుచ్చుకుంటారు.
ఈ ఏడాది జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్థాన్ భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంది. దీంతోపాటు పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తరచూ కాల్పులకు దిగింది. దీంతో భారత సైనికులు ప్రతీకార దాడులు చేశారు. భారత, పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది దీపావళి సందర్భంగా వాఘా సరిహద్దుల్లో మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవడం ఉండదని భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.