తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో పాటు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, ఫడ్నవిస్ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
హరీశ్ వ్యాఖ్యల పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదనడం ఎంతమాత్రమూ సరికాదని అన్నారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి పిలవలేదన్న బాధతోనే హరీశ్ అలాంటి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల గురించి మీ మామను అడిగి తెలుసుకోవాలని, పిచ్చి ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకోమని జగ్గారెడ్డి హెచ్చరించారు.