తెలుగు తేజం పీవీ సింధు ఇటీవల జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతగా నిలిచి మన భారతదేశానికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. ఈ క్రీడాకారిణి సాధించిన విజయంతో దేశం యావత్తు గర్వపడింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆమెను అభినందించారు. తాజాగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ ఖరీదైన బి.ఎం.డబ్ల్యు కారుని సింధుకి హీరో అక్కినేని నాగార్జున చేతుల మీదుగా బహుకరించారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ “సింధు ఆడిన బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్ చూశాను. ప్రత్యర్థిని ఆమె మట్టికరిపించింది. ఆమెను ఎన్ని రకాలుగా అప్రిషియేట్ చేసినా తక్కువే. సింధుని చూసి చాలా గర్వపడుతున్నాను. చాలా అద్భుతమైన విజయమది. ఈ విజయపరంపరను ఆమె ఇంకా కొనసాగించి మమ్మల్ని గర్వపడేలా చేయాలి. చాముండేశ్వరినాథ్ ఇప్పటి వరకు 22 కార్లను బహుమతిగా ఇచ్చారు. సింధుకి ఆయన గిఫ్ట్‌గా ఇస్తున్న నాలుగో కారు ఇది. సింధుకే కాదు.. దేశంలోని చాలా మంది అథ్లెట్స్‌ను గుర్తించి వారికి గైడెన్స్ ఇవ్వడంలో చాముండి ఎప్పుడూ ముందుంటారు” అన్నారు.