telugu navyamedia
సినిమా వార్తలు

నీ పుట్టినరోజు!

nidaipoina na manasu poetry corner
నీ పుట్టిన రోజు నాకెపుడు ప్రత్యేకమే. 
ఈ రోజు నువు పుట్టిన రోజనే కాదు
నేను కొత్తగా పుట్టిన రోజు కూడా. 
అదివరకెపుడూ నన్ను నేను చూడనట్టు
వింతగా చూసుకోవడం మొదలైన రోజు.
నిన్ను నా మనో దర్పణంలో ఆరాధనతో
చూడటం ఆరంభమైన రోజు.
నా మనసు తూనీగల రెక్కలపై వాలి 
గాలి తరగలపై తేలియాడటం 
నేర్చుకున్న రోజు.
కలలంటే 
నిద్రలో వచ్చే కలలనే తెలిసిన నాకు 
మెలకువలోనూ కలలుగనే కళని 
పరిచయం చేసిన రోజు.
నీ పేరును పలికేటపుడు నా అధరాలు పొందే
మధురానుభూతిని మళ్ళీ మళ్ళీ
రుచి చూడాలన్న ఆకాంక్ష అంకురించిన రోజు.
ఇదివరకెరుగని నూత్న భావాల పరమళాలు
నా మది గది నిండిపోయిన రోజు.
నాకే తెలియని నన్ను 
నాకు పరిచయం చేసిన
నీ పుట్టినరోజు నాకు పండుగ రోజే మరి!
ఈ పండుగ రోజు నాకు మళ్ళీ మళ్ళీ రావాలని
నీవు నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని
ఆశిస్తున్నాను
ఆకాంక్షిస్తున్నాను.
-సిరా

Related posts