నందమూరి తారక రామారావు గారు నటించిన మహత్తర పౌరాణిక చిత్ర రాజం ఎన్.ఏ.టి.వారి “పాండురంగ మహత్యం” చిత్రం 28-11-1957 విడుదల.
ఎన్.టి.ఆర్. గారి సోదరులు నందమూరి త్రివిక్రమరావు గారు నిర్మాతగా తమ స్వంత నిర్మాణ సంస్థ నేషనల్ ఆర్ట్ థియేటర్(NAT) పతాకంపై ప్రముఖ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు: (జూనియర్) సముద్రాల రామానుజాచార్య, ఫోటోగ్రఫీ:: ఎం.ఏ.రహమాన్, సంగీతం: టి.వి.రాజు, కళ: తోట తరణి, నృత్యం: వెంపటి సత్యం, కూర్పు: జి.డి.జోషి, అందించారు.
ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, అంజలీదేవి, నాగయ్య, బి.సరోజాదేవి, రుష్యేంద్రమణి, పద్మనాభం, ఛాయాదేవి, విజయనిర్మల, కస్తూరి శివరావు, పెకేటి శివరాం, బొడ్డపాటి కృష్ణారావు, ఛాయాదేవి, వల్లూరి బాలకృష్ణ, అమ్మాజి, షావుకారు జానకి(అతిథి పాత్ర) తదితరులు నటించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు టి.వి.రాజు గారి సంగీతసారధ్యంలో …
“హే కృష్ణా ముకుందా మురారి
జయకృష్ణా ముకుందా మురారి”
“అమ్మా అని పిలిచినా ఆలకించవేమమ్మా”
“ఏ పాదసీమ కాశీ ప్రయాగాది”
“హర హర హర శంభో శంభో హిమగిరి శ్రుంగ విహారీ”
“నీవని నేనని తలచితిరా, నీవే నేనని తెలిసితిరా”
“చెబితే వింటివ గురూ గురూ,వినకే చెడితి శిష్యా”
వంటి సుమదురమైన పాటలు నాటికి నేటికి
ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
ఎన్.టి.రామారావు గారు నటించిన వజ్రోత్సవ చిత్రం (60 వ చిత్రం) ” పాండురంగ మహాత్మ్యం.”
ఈ చిత్రంలో ‘పుండరీకుడు’ అనే విష్ణుభక్తుని పాత్రలో ఎన్టీఆర్ గారు ప్రదర్శించిన నవరసనటన ప్రేక్షక హృదయాలను కట్టిపడేసింది.
ముఖ్యంగా “హే కృష్ణా ముకుందా మురారి” పాట సమయంలో ఆ దివ్యమంగళ రూపము, ఆ ధ్యానముద్ర, ఆ కళ్ళలో దివ్యకాంతి, ఆ ముఖంలో ప్రశాంతత, ఆత్మను అంతర్ముఖం చేసి , అస్నందానుభూతిని పొందే కారణ జన్ముడిగా ఎన్టీఆర్ గారి నటన హిమాలయమంత ఎత్తు ఎదిగింది!! ఏమా కళ..నిజంగా ఆయనకు దైవ సాక్షాత్కారము జరిగిందా అన్న ఫీలింగ్ ఇప్పటికీ ఆ స్టిల్ చూస్తే మనకు కలుగుతుంది. గ్రేట్..!!
ఇలా ఈ చిత్రాన్ని ఒక క్లాసిక్ గా మలచి, తమ బ్యానర్ లో మంచి విజయం సాధించటంతో పాటు, నటనలో మహోన్నత శిఖరాలను అందుకుని తన సత్తాను మరోసారి నిరూపించుకున్నారు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు. ఈ చిత్రం ద్వారా నటిమణి బి.సరోజాదేవి తెలుగుతెరకు పరిచయం కాగా, అప్పటివరకు పాటల రచయితగా వున్న సముద్రాల జూనియర్ గారు మాటల రచయితగా ఈ చిత్రం ద్వారా పరిచయ మయ్యారు. మరొక నటీమణి విజయనిర్మల బాలకృష్ణుడు గా ఈ సినిమా ద్వారానే వెండితెరకు పరిచయం కావటం జరిగింది. ఈచిత్రం ఘన విజయం సాధించి విడుదలైన దాదాపు అన్ని కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శింపబడి,
7 కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకున్నది. విజయవాడ, గుంటూరు పట్టణాలలో రజతోత్సవం దిశగా నడిచింది.
విజయవాడ – శ్రీ లక్ష్మీ టాకీస్ లో (15 మార్చి 1958)
“పాండురంగ మహత్యం” చిత్రం శతదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
100 రోజులు ప్రదర్శింపబడిన కేంద్రాలు:–
1. విజయవాడ – శ్రీ లక్ష్మీ టాకీస్ (147 రోజులు)
2. గుంటూరు — హరి హర మహల్ (24 వారాలు)
3. తెనాలి — వేంకటేశ్వర,
4. కాకినాడ — ప్యాలస్,
5. ఏలూరు — షా మహల్,
6. రాజమండ్రి — శ్రీ రామా,
7. విజయనగరం– అశోక,
థియేటర్లలో100 రోజులు ప్రదర్శింపబడి నిర్మాతలకు మంచి లాభాలను చేకూర్చింది. అంతేగాక ఈ చిత్రం ఎన్ని పర్యాయాలు విడుదలైనప్పటికి తరగని ప్రజాదరణను సొంతంచేసుకుంది…..
లిప్ లాక్ గురించి మాట్లాడితే… ఆ అమ్మాయితో పని కష్టం : యామీ గౌతమ్