బ్యానర్ : ఐరా క్రియేషన్స్
నటీనటులు : నాగశౌర్య, మెహ్రీన్, పోసాని, ప్రిన్స్ , జయప్రకాశ్, ప్రగతి తదితరులు
కథ : నాగశౌర్య
దర్శకత్వం : రమణతేజ
సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
నిర్మాత : ఉషా ముల్పూరి
యంగ్ హీరో నాగశౌర్య “ఊహలు గుసగుసలాడే” సినిమాతో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. 2018లో ఛలో చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న నాగశౌర్య ఆ తర్వాత కణం, అమ్మమ్మగారిల్లు, నర్తనశాల వంటి చిత్రాలతో వరుస ఫ్లాపులు మూటగట్టుకున్నాడు. ఆ తరువాత “ఓ బేబి”లో కీలకపాత్రలో నటించి మెప్పించాడు. ‘ఛలో’ సినిమా తరువాత సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగశౌర్య.. తన లవర్ బాయ్ ఇమేజ్‌ను పక్కనపెట్టి యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ‘అశ్వథ్థామ’గా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ :
గణ (నాగశౌర్య)కు చెల్లెలు (ప్రియా) అంటే చిన్నప్పటి నుంచీ ప్రాణం. ప్రియా ఎంగేజ్మెంట్ జరుగుతున్న సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అది గమనించిన గణ ఆమె ఆత్మహత్యను ఆపి… అందుకు గల కారణం ఏంటో తెలుసుకుంటాడు. కారణం ఏంటంటే…. ప్రియా తనకు తెలీకుండానే… తన ప్రమేయం లేకుండానే గర్భవతి అవుతుంది. దీంతో ప్రియకు అబార్షన్ చేయించి, పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాడు గణ. అయితే తన చెల్లెలికి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటాడు. అందులో భాగంగా చేసిన ఇన్వెస్టిగేషన్ లో షాకింగ్ నిజాలు బయటపడతాయి. అసలు దీనంతటికీ కారణం ఎవరో తెలుసుకోవాలనుకుంటాడు గణ. మరి గణ చేసిన ప్రయత్నం ఫలించిందా ? ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డ ఆ షాకింగ్ నిజాలు ఏంటి ? అసలు ఇదంతా చేస్తున్నది ఎవరు ? చివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.
నటీనటుల పనితీరు :
నాగ శౌర్య సినిమా మొత్తాన్ని తానే నడిపించాడు. హీరోగా తన లుక్ బావుంది. సినిమాలో సిక్స్ ప్యాక్ చూపంచలేదు కానీ… సిక్స్ పాక్య్ లుక్ అని చూడగానే మనకు అర్థమయ్యేలా ఉంది. పెర్ఫామెన్స్ పరంగా తను బాగా చేశాడు. ఇక హీరోయిన్ మెహ్రీన్ పాటలకు పరిమితమైంది. పోసాని కన్పించింది చిన్న సీన్‌లో అయినప్పటికీ తన నటనతో ప్రాణం పోశాడు. ప్రిన్స్ , జయప్రకాశ్, ప్రగతి పాత్రలకు కూడా పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక మెయిన్ విలన్‌గా నటించిన జుస్సుసేన్ గుప్తా నటన బావుంది. సైకో విలన్‌గా తన నటన ఆకట్టుకుంటుంది. మిగతా నటీనటులంతా పాత్రల పరిధి మేర నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు సినిమాను అంత ఎమోషనల్ గా నడిపించలేకపోయాడు. అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ తో వచ్చిన ఈ చిత్రంలో ఎక్కడా ఎమోషనల్ గా టచ్ అవ్వదు. పాటలు బాగాలేవు. జిబ్రాన్ నేపథ్య సంగీతం ఓకే. మనోజ్ కెమెరా పనితనం బావుంది. సినిమాలో ఇంటర్వెల్ సీన్ హైలెట్. ఇక క్లైమాక్స్ తేలిపోయినట్టుగా అన్పిస్తుంది. కానీ సినిమా ద్వారా దర్శకుడు మంచి మెసేజ్ ను ఇవ్వగలిగాడు. ఇక సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.
రేటింగ్ : 2.5 /5