telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ టైటిల్ .. ముంబై చేతికి.. చివరిలో హ్యాండిచ్చిన … చెన్నై..

mumbai won on chennai in ipl2019 final

ఐపీఎల్ ఆఖరి పోరు కూడా ఉత్కంఠ భరితంగా సాగిపోయింది. అయినా సాధారణ లక్ష్యం మాత్రమే ముంబై ప్రత్యర్థి జట్టుకు ఇచ్చినా, దానిని కూడా ఛేదించకుండా కట్టుదిట్టంగా పోరాడింది. దీనితో చివరి బంతి వరకు ఉత్కంఠ తప్పలేదు.. విజయం ముంబై చేతికి. మొదటి నుండి తన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో కూడా ముందున్న చెన్నై పై ఆశలు పెట్టుకున్న అభిమానులకు చివరికి నిరాశే మిగిలింది. మొత్తానికి ఈ సీజన్ ఐపీఎల్ టైటిల్ ముంబై ఎగరేసుకుపోయింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌-12 ఫైనల్లో ముంబయి ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. కీరన్‌ పొలార్డ్‌ (41 నాటౌట్‌; 25 బంతుల్లో 3×4, 3×6) జట్టును ఆదుకున్నాడు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేయగలిగింది. ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ (80; 59 బంతుల్లో 8×4, 4×6) పోరాడినా చివరి మెట్టుపై చతికిలపడ్డాడు. బుమ్రా (2/14), రాహుల్‌ చాహర్‌ (1/14) అద్భుత బౌలింగ్‌తో ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఐపీఎల్ ఫార్మాట్ లో 150 పరుగుల లక్ష్యం పెద్దదేమీ కాకపోయినా ముంబయి బౌలర్ల క్రమశిక్షణ ఆకట్టుకుంది. ఓపెనర్లు వాట్సన్‌, డుప్లెసిస్‌ (26; 13 బంతుల్లో 3×4, 1×6) వేగంగా పరుగులు రాబట్టినా పట్టు వీడలేదు. కృనాల్‌ వేసిన నాలుగో ఓవర్లో డుప్లెసిస్‌ 2 బౌండరీలు, ఒక సిక్సర్‌ బాదాడు. ఐతే అదే ఓవర్లో మరో భారీ షాట్‌ కోసం వికెట్లు ముందుకొచ్చిన డుప్లెసిస్‌ను డికాక్‌ స్టంపౌట్‌ చేశాడు. వాట్సన్‌, డుప్లెసిస్‌ తొలి వికెట్‌కు 33 పరుగులు జోడించారు. ఆ వెంటన వాట్సన్‌ అందుకున్నాడు. మలింగ వేసిన ఆరో ఓవర్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 15 పరుగులు పిండుకున్నాడు. ఐతే 12 పరుగుల తేడాలో రైనా (8), రాయుడు (1), ధోని (2) ఔటవడంతో 82 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన చెన్నై పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇక చెన్నై పనైపోయినట్లుగా అనిపించింది. రాహుల్‌ చాహర్‌ గొప్పగా బౌలింగ్‌ చేశాడు. 4 ఓవర్లలో ఒక వికెట్‌ తీసి 14 పరుగులే ఇచ్చాడు. 15 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 88/4. ఆ సమయంలో చెన్నై విజయానికి 30 బంతుల్లో 62 పరుగులు కావాలి. దాదాపుగా రెట్టింపు రన్‌రేట్‌. ఐతే మలింగ వేసిన 16వ ఓవర్‌ మ్యాచ్‌ను ఉత్కంఠ వైపు తిప్పింది. తొలి బంతినే బ్రావో సిక్సర్‌గా మలచగా.. వాట్సన్‌ వరుసగా 3 బౌండరీలు బాదాడు. ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. సమీకరణం 24 బంతుల్లో 42 పరుగులుగా మారిపోయింది. 17వ ఓవర్లో బుమ్రా 4 పరుగులే ఇచ్చాడు. కృనాల్‌ 18వ ఓవర్లో వాట్సన్‌ వరుసగా మూడు సిక్సర్లతో చెలరేగి 20 పరుగులు రాబట్టాడు. ఇక 12 బంతుల్లో 18 పరుగులు చేయాలి. మ్యాచ్‌ చెన్నై చేతుల్లోకి వచ్చేసినట్లుగా అనిపించింది. 19వ ఓవర్లో బుమ్రా.. బ్రావో (15; 15 బంతుల్లో 1×6)ను ఔట్‌ చేశాడు. ఆఖరి బంతికి డికాక్‌ బైస్‌ ఇవ్వడంతో బంతి బౌండరీకి వెళ్లింది. చివరి ఓవర్లో చెన్నై 6 బంతుల్లో 9 పరుగులు చేయాలి. తొలి 3 బంతుల్లో 4 పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి రెండో పరుగు కోసం వెనక్కి వచ్చిన వాట్సన్‌ రనౌటయ్యాడు. అప్పటి వరకు చెన్నై చేతుల్లో ఉన్న మ్యాచ్‌ ముంబయి వైపు తిరిగింది. 2 బంతుల్లో 4 పరుగులు కావాలి. ఐదో బంతికి 2 తీసిన శార్దూల్‌ చివరి బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు.

హార్దిక్‌ వేసిన 13వ ఓవర్‌ ఉత్కంఠకు తెరతీసింది అనే చెప్పాలి. నాలుగో బంతికి వాట్సన్‌ సింగిల్‌ తీశాడు. మిడ్‌ వికెట్‌లో ఉన్న బౌలర్‌ నాన్‌ స్ట్రైకర్‌ వైపు వికెట్లకు బంతిని త్రో చేశాడు. హార్దిక్‌ బంతిని అందుకోలేదు. ఓవర్‌ త్రో వెళ్లగానే ధోని రెండో పరుగు మొదలుపెట్టాడు. డీప్‌ కవర్స్‌ నుంచి మెరుపులా పరుగెత్తుకుంటూ వచ్చిన ఇషాన్‌ కిషన్‌ నేరుగా వికెట్లను త్రో విసిరాడు. తొలుత ఔటని భావించి ధోని నడక ప్రారంభించగా.. అంపైర్లు వెళ్లొద్దంటూ అతడిని ఆపారు. థర్డ్‌ అంపైర్‌ చాలా సేపటి వరకు నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. చివరికి ధోని ఔటయ్యాంటూ ప్రకటించగానే ముంబయి మ్యాచ్‌ గెలిచినంత సంబరాల్లో మునిగి తేలింది.

చెన్నైపై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా రోహిత్‌ టాస్‌ గెలవగానే బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. రోహిత్‌ ఆరంభంలోనే శార్దూల్‌ బౌలింగ్‌లోభారీ సిక్సర్‌తో అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. చాహర్‌ వేసిన మూడో ఓవర్లో డికాక్‌ (29; 17 బంతుల్లో 4×6) చెలరేగాడు. 3 భారీ సిక్సర్లతో ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని శార్దూల్‌ విడదీశాడు. భారీషాట్‌కు ప్రయత్నించిన డికాక్‌.. ధోని చేతికి చిక్కాడు. అక్కడ్నుంచి చివరి వరకు ముంబయి బ్యాటింగ్‌ తడబాటు కొనసాగింది. ఆ తర్వాతి ఓవర్లోనే అద్భుతమైన బంతితో రోహిత్‌ (15; 14 బంతుల్లో 1×4, 1×6)ను చాహర్‌ బోల్తాకొట్టించాడు. ఈ ఓవర్లో వికెట్‌, మెయిడిన్‌తో చాహర్‌ ఆకట్టుకున్నాడు. పవర్‌ ప్లేలో ముంబయి 2 వికెట్లకు 45 పరుగులే చేసింది. అనంతరం ముంబయి బ్యాట్స్‌మెన్‌పై చెన్నై బౌలర్లు ఒత్తిడి పెంచారు. హర్భజన్‌, బ్రావో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. దీంతో సూర్యకుమార్‌ (15; 17 బంతుల్లో 1×4), ఇషాన్‌ కిషన్‌ (23; 26 బంతుల్లో 3×4) జాగ్రత్తగా ఆడారు. ఐతే క్రీజులో కుదురుకున్న సూర్యకుమార్‌.. తాహిర్‌ వేసిన బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడు. శార్దూల్‌ వేసిన తర్వాతి ఓవర్లో కృనాల్‌ పాండ్య (7) అతడికే క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తాహిర్‌ బౌలింగ్‌లో పొలార్డ్‌ బాదిన సిక్సర్‌తో ముంబయి స్కోరు 100 (14.1 ఓవర్లలో)కు చేరుకుంది. అయితే అదే ఓవర్లో ఇషాన్‌ ఔటయ్యాడు. పొలార్డ్‌కు జతగా హార్దిక్‌ క్రీజులో ఉండటంతో ముంబయి భారీస్కోరుపై ఆశలు సన్నగిల్లలేదు. అందుకు తగ్గట్లే పొలార్డ్‌, హార్దిక్‌ సిక్సర్లతో చెలరేగారు. హెలిక్యాప్టర్‌ షాట్‌తో సిక్సర్‌ బాదిన హార్దిక్‌ను చాహర్‌ యార్కర్‌ బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అదే ఓవర్లో రాహుల్‌ చాహర్‌ (0) నిష్క్రమించాడు. 19వ ఓవర్లో చాహర్‌ 4 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో పొలార్డ్‌ అన్ని బంతులూ ఎదుర్కొన్నా.. రెండు ఫోర్లు మాత్రమే బాదడంతో ముంబయి 149 పరుగులకే పరిమితమైంది.

Related posts