telugu navyamedia
సినిమా వార్తలు

ఏపీలో సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రభుత్వ పోర్టల్

సినిమా టికెట్ల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఆ మధ్య కరోనా సమయంలో టిక్కెట్ రేట్లను నియంత్రిస్తూ చర్యలు తీసుకున్న ప్రభుత్వం, తాజాగా ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ పైనా ఫోకస్ పెట్టింది. సింగిల్ థియేటర్లు, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఆన్ లైన్ బుకింగ్ పేరుతో మధ్యవర్తులు భారీ మొత్తాలను వసూలు చేస్తున్నారు. టిక్కెట్ కు రూ. 10 నుంచి రూ.20 వరకు అదనంగా సర్వీస్ ఛార్జీల పేరుతో దోచుకుంటున్నారు. సినిమా టికెట్‌ ధరల విషయంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు రైల్వే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ తరహాలో పోర్టల్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు జీవోను విడుదల చేసింది.

‘‘సినిమా థియేటర్స్‌లో టికెట్స్‌ విక్రయించే ప్రక్రియను ప్రభుత్వం నిశితంగా గమనించిన తర్వాత, ఆన్‌లైన్‌ బుకింగ్‌ కోసం పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షిస్తుంది. ఇందుకు సంబంధించిన విధి-విధానాలు, అభివృద్ధి, అమలు ప్రక్రియను ప్రభుత్వం నియమించిన కమిటీ చూసుకుంటుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది.  ఇక నుంచి ఏపీ సినిమా హాళ్ళలో online booking ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంటుంది. కలెక్షన్ అంతా ప్రభుత్వం చేతుల్లోకి వస్తుంది . ప్రతి నెలా 30 వ తారీఖున ప్రొడ్యూసర్స్ కి, డిస్ట్రిబ్యూటర్లకు వాళ్ళ వాటా ఇస్తారు, అప్పటిదాకా డబ్బులన్నీ ప్రభుత్వం దగ్గరే వుంటాయి.

కరోనా కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిబంధనల మేరకు చిత్రీకరణలు జరుగుతున్నా, పెద్ద సినిమాలు థియేటర్‌లో విడుదలయ్యే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. తెలంగాణ థియేటర్స్‌ పూర్తిగా అందుబాటులోకి వచ్చినా, ఏపీలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయి. దీంతో నిర్మాతలు, థియేటర్స్‌ యజమానులు, పంపిణీదారులు ఏదో రూపంలో నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వ్యవ్యస్థను తెలంగాణాలో తీసుకు రావాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని
శ్రీనివాస యాదవ్ ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నారు. థియేటర్ల ఆక్యుపెన్సీని 50 శాతం నుండి 100 శాతానికి పెంచాలని ఎగ్జిబిటర్స్ కొంతకాలంగా కోరుతున్నారు.

Related posts