telugu navyamedia
తెలంగాణ వార్తలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు అసహనం

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో ఒకవేళ కరోనా మూడోదశను ఎదుర్కోవలసి వస్తే ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేశారో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అసహనం వ్యక్తంచేసింది. ప్రణాళికలు, ప్రక్రియల కోసం వైరస్ వేచి చూడదని అన్నారు. ప్రభుత్వాలు కొన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.

గత అనుభవాల దృష్ట్యా నష్టాన్ని నివారించాలని, ఇప్పటికే కరోనా బారిన పడి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మూడోదశ ముప్పు ముంచుకొస్తోందని, కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతంగా చర్యలు చేపట్టాలని ఆదేశించినా నిపుణుల కమిటీ భేటీ ఇంకా నిర్వహించలేని అసంతృప్తి వ్యక్తం చేసింది. వారంలోగా నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించాలని, మూడో దశను ఎదుర్కొనే ప్రణాళిక రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. పిల్లల చికిత్సకు తీసుకున్న వివరాలు సమర్పించాలని, మా ఆదేశాలు అమలు కాకపోతే డీహెచ్, కేంద్ర నోడల్ అధికారి కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.

Related posts