telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ప్రజా సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం వెనుకాడదు: కేటీఆర్

హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సమీపంలోని పిల్లి గుడిసెల బస్తీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 24.91 కోట్ల వ్యయంతో 9 అంతస్తుల్లో 288 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. వాటిని విడతల వారీగా లబ్దిదారులకు అందచేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మురికివాడగా ఉన్న ఈ బస్తీని అద్భుతంగా తీర్చిదిద్దామని అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పాత, కొత్త నగరం అనే తేడా లేకుండా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణాలు చాలావరకు పూర్తిచేశామని అన్నారు. రూ. 50 లక్షల విలువైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పేదలకు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. నాణ్యతలో రాజీపడకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టామని అన్నారు. ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం వెనుకాడదని అన్నారు. ఉస్మానియా ఆస్పత్రి కొత్తది నిర్మించాలని స్థానిక నాయకులు కోరుతున్నారని తెలిపారు. ఉస్మానియా ఆస్ప‌త్రి శిథిలావ‌స్థ‌లో ఉన్న విష‌యాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణలో ఆస్పత్రులను అభివృద్ధి చేశామని, రెండేళ్లలో మేం 4 టిమ్స్ ఆస్పత్రులను నిర్మించబోతున్నామని, 70 ఏళ్లలో కేవలం 3 ఆస్పత్రులు కట్టారని ఎద్దేవా చేశారు.

చంచ‌ల్‌గూడ జైలును ఇక్క‌డి నుంచి త‌ర‌లించాల‌ని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఓవైసీ విజ్ఞ‌ప్తి చేశారని మంత్రి కేటీఆర్ తెలిపారు. 34 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న చంచ‌ల్‌గూడ జైలు స్థలంలో ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా ఇళ్లు లేదా ఐటీ పార్కు లేదా విద్యాసంస్థ‌లు ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నారని, ఈ విష‌యాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామ‌ని కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం వెన‌క్కిపోదని స్ప‌ష్టం చేశారు.

Related posts