నగరంలోని న్యాయవాదులు శాశ్వత హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ విధులు బహిష్కరించారు. జిల్లా కోర్టు ప్రధాన ద్వారం వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా…’విశాఖలో హైకోర్టు ఏర్పాటుచేయాలి…ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలి’…అంటూ నినాదాలు చేశారు. నగరంలో హైకోర్టు ఏర్పాటుచేయడం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతంలోని కక్షిదారులకు ఊరట లభిస్తుందన్నారు. రాష్ట్ర బార్ అసోసియేషన్ వైస్ చైర్మన్ మురళీ, కార్యదర్శి కొండబాబు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
గురువారం ఉదయం 11 గంటలకు జగదాంబ జంక్షన్‌లో ధర్నా నిర్వహించనున్నట్టు న్యాయవాదుల సంఘాల నాయకులు ప్రకటించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్టు తెలిపారు. గురు,శుక్రవారాల్లో నిరసనలు తీవ్రతరం చేయాలని, అందుకు జిల్లాలోని న్యాయవాదులంతా సహకరించాలని కోరారు. కాగా న్యాయవాదులు విధులు బహిష్కరించడంతో బుధవారం కోర్టులు వెలవెలపోయాయి. కక్షిదారులు మధ్యాహ్నం వరకు చూసి తిరిగి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కోర్టు ఆవరణ ఖాళీగా దర్శనమిచ్చింది.