telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెడతాం- ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి ఫైర్ అయ్యారు.. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ. ..స్వంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని మోసం చేశారని, అమరావతి కోసం గుంటూరు, విజయవాడకు అన్యాయం చేశారని మండిపడ్డారు

అమరావతిలోని 29 గ్రామాల కోసమే ఉద్యమం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తామని రైతులు అంటున్నారని, విశాఖకు రాజధాని వద్దని చేస్తున్న పాదయాత్ర అని.. ఇది విశాఖపై దండయాత్రేనని అన్నారు.

ఉత్తరాంధ్రపై దండయాత్ర చేస్తే.. ప్రజలు చూస్తూ ఊరుకోరని మంత్రి గుడివాడ అమర్ నాధ్ అన్నారు. పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తే జనం చూస్తూ ఊరుకోరని మంత్రి వార్నింగ్ ఇచ్చారు.
పాదయాత్రతో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే అందుకు చంద్రబాబే బాధ్యత వహించాలని మండిపడ్డారు.

అమరావతిలో జరిగిన పుస్తకావిష్కరణ సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా ఇతర పార్టీ నేతలు ముఖ్యమంత్రి గురించి చులకనగా,అవహేళనగా మాట్లాడడం సరికాదన్నారు.ఈ సభలో చంద్రబాబుతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే వారు కూడా విశాఖ ప్రాంత వ్యతిరేకులుగా భావించవలసి వస్తోందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలనే ఉద్దేశ్యంతో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం ముందుకు తెచ్చిందన్నారు.

అసెంబ్లీలో మూడు రాజధానులపై బిల్లు పెడతామ‌ని, మూడు రాజధానులు చేసి తీరుతామని మంత్రి గుడివాడ అమర్‌నాధ్ పేర్కొన్నారు. గతంలో రాజధానిపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును సవరించి కొత్త బిల్లు పెట్టాలనే ఆలోచన చేశామని, అయితే కోవిడ్ కారణంగా ఇది కొంత ఆలస్యం అయిందని ఆయన వివరించారు.

అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ క్షణంనుంచైనా విశాఖ నుంచి పాలన ఆరంభించవచ్చన్నారు.. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలన్న సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారన్నారు. కానీ అమరావతి ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి అరసవెల్లి యాత్రకు ఉసిగొల్పారని ఆయన విమర్శించారు.

\

Related posts