మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా కాలంలో కట్టలేక పెనాల్టీ పడితే దానిపై నిర్ణయం తీసుకుంటామని.. చెత్త సేకరణకు ఇంటికి రూపాయి…దానికి కూడా ఇబ్బందేనా..? అని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. దేశంలో చాలా రాష్ట్రాల్లో చూసి వచ్చాం…వాళ్లంత పన్ను మేము వేయడం లేదే.. పేద వారి గురించి మాట్లాడే పేటెంట్ మా నాయకుడికే ఉందన్నారు. ఆస్తి పన్ను పెంపుపై ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని.. బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. పన్ను విధింపులో ఇప్పటివరకు ఉన్న లోపభూయిష్ట విధానం ఉండగా దాన్ని మార్చుతున్నామని.. పారదర్శకంగా విధానం ఉండాలి, ఎవరికీ వ్యత్యాసం లేకుండా ఉండేలా నూతన విధానం అమలు చేస్తున్నామని వెల్లడించారు. కేంద్ర సూచనల మేరకే ఆస్తిపన్ను విధింపు విధానాల్లో మార్పులు చేశామని.. మూడు రాష్ట్రాల్లో పన్ను వసూలు అమలు జరుగుతోన్న విధానాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న ఆస్తి పన్నుకు 15 శాతానికి మించకుండా ఉండేలా చట్టం చేసి అమలు చేస్తున్నామని.. ఆస్తి పన్ను ఎక్కడా 15 శాతానికి ఎట్టి పరిస్థితుల్లో మించదని పేర్కొన్నారు. పత్రికలు, పార్టీలు ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని కోరుతున్నానని.. ఏ ఒక్కరికీ భారం పడకూడదని, ఇబ్బంది పడకూడదనే సంస్కరణలు తెస్తున్నామని స్పష్టం చేసారు.
previous post

