telugu navyamedia
తెలంగాణ వార్తలు

రాజాసింగ్ ను అసెంబ్లీ నుండి బహిష్కరించాలి – స్పీకర్ కు ఎంఐఎం లేఖ

గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను తెలంగాణ అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని మజ్లిస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎంఐఎం జనరల్ సెక్రటరీ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి లేఖ రాశారు.

మహమ్మద్ ప్రవక్తపై ఆయన చేసిన వ్యాఖ్యలు శాసన సభ గౌరవాన్ని దిగజార్చాయని.. ముస్లింల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని లేఖలో పేర్కొన్నారు. శాసన సభ సభ్యుడిగా చేసిన ప్రమాణాన్ని రాజాసింగ్ ఉల్లంఘించాడని, పదేపదే హింసను ప్రేరేపించాడని లేఖలో తెలిపారు.

రాజాసింగ్ శాసనసభ్యుడిగా ఉండేందుకు అనర్హుడని నిరూపించడానికి ఆయన చేసిన వ్యాఖ్యలే  ఉదాహరణ అని పాషా ఖాద్రీ పేర్కొన్నారు. 

ఈ వ్యాఖ్యల ఆధారంగా రాజాసింగ్ ను  అసెంబ్లీ నుండి బహిష్కరించేందుకు గాను అవసరమైన ప్రోసీడింగ్స్ ను మొదలు పెట్టాలని కూడా ఆ లేఖలో కోరారు. ఈ లేఖను అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. 

కాగా, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌, ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిన దుమారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా.. రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది బీజేపీ. మరోవైపు రాజాసింగ్‌ వ్యాఖ్యలపై పాతబస్తీలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. నాటకీయ పరిణామాల తర్వాత మంగళవారం రాత్రి రాజాసింగ్‌కు బెయిల్‌ దక్కిన నేపథ్యంలో.. భారీగా యువత ఓల్డ్‌సిటీలో రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో  ఉద్రిక్త వాతావరణం నెలకొంది

Related posts