మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం “సైరా నరసింహారెడ్డి”. అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతారలాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్ సామాన్యులతోపాటు సినీ ప్రముఖులను సైతం ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉయ్యలవాడ నర్సింహారెడ్డి పాత్రలో కనిపించాలని మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. ఎట్టకేలకు అది కార్యరూపం దాల్చింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సైరా’ చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి పలు విషయాలు వెల్లడించారు. ‘ఈ సినిమా అయిపోయిన తర్వాత ప్రేక్షకులు ఒక గొప్ప ఫీలింగ్‌తో బయటకు వస్తారని నమ్మకంగా చెప్పగలను. ఈ సినిమా ప్రారంభం అయినప్పట్నుంచి నేను చాలా మారిపోయాను. నవ్వడం మానేశాను. సీరియస్ అయిపోయాను. ఇప్పట్లో మళ్లీ ఇలాంటి పాత్ర చేయలేను. భగత్ సింగ్ క్యారెక్టర్ చేయాలనుకున్నాను. అయితే ఇక ఆ పాత్ర చేయలేననుకుంటున్నాను. ఆ పాత్ర చరణ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను” అని చిరంజీవి చెప్పారు.
previous post