telugu navyamedia
సామాజిక

సంక్రాంతి పండుగ విశిష్ట‌త‌..

తెలుగువారు జరుపుకునే అతి పెద్ద‌ పండుగ సంక్రాంతి. తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే అతిపెద్ద పండగ సంక్రాంతి. ముఖ్యంగా  ఆంధ్రప్రదేశ్, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ పండగను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకుంటారు.

ఈ పండగ తొలి రోజును భోగి అంటారు. రెండో రోజును మకర సంక్రాంతిగా.. మూడో రోజును కనుమగా పిలుస్తారు. ఇక నాలుగో రోజును ముక్కనుమ అంటారు.

సంక్రమణం అంటే ..సూర్యభగవానుడు ధనుస్సు రాశిని విడిచిపెట్టి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర సంక్రమణం జరిగింది. కావున దీనికి మకర సంక్రాంతి అని పేరు. ఈరోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణంలో మరణించిన జీవుడు ఉత్తర దిక్కుగా ప్రయాణించి మోక్షం పొందురని శాస్ర్తం చెబుతుంది.

సంక్రాంతి ముందు రోజువచ్చే పండుగ భోగి. ఈ రోజుతో నెలరోజులు ఉత్సాహంగా సాగిన ధనుర్మాసం ముగుస్తుంది. గోదాదేవి మార్గళివ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతం చేపట్టి నారాయణుని కొలిచి శ్రీరంగనాథుడి అనుగ్రహం పొందిన రోజు భోగి. ఈ పండుగను జ్ఞానానికి సూచికగా చెబుతారు.

ఆ తరువాత వచ్చేది పెద్ద పండ‌గ మకర సంక్రాంతి తరువాత వచ్చేది కనుమ. ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాలలో వేరువేరు పేర్లతో పిలుస్తుంటారు. మకరసంక్రాంతి రోజున పుణ్యస్నానం చేసి నువ్వులు, నువ్వుల లడ్డూ, అన్నం, కూరగాయలు, పప్పులు దానం చేసే సంప్రదాయం ఉంది.

ఈరోజు ప్ర‌తి ఒక్క‌రూ సూర్యోద‌యానికి ముందే న‌ల్ల‌నువ్వులు ముద్ద‌ను ఒంటికి , త‌ల‌పైనా పూసుకుని స్నానం చేస్తే ఆరోగ్యం ఆయూష్సూ పెరుగుతుంద‌ని పూరుణాలు చెబుతున్నారు. ఇంటిని శుభ్రపరచుకుని, గడపకు పసుపు, కుంకుమలు పెట్టి, గుమ్మానికి తోరణాలు కట్టి, పూలతో అలంకరిస్తారు

కొత్త పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగను ఆనందంగా చేసుకుంటారు. సంప్రదాయ దుస్తులను ధరించి ఇంటి ముందర రంగు రంగుల ముగ్గులతో చూడ ముచ్చటైన పండుగ వాతావరణంతో కనులకు కనువిందు చేసే ఆనందదాయకంగా జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు

 

ఈ రోజు గుమ్మడిపండు , నువ్వులు, పెరుగు దానం చేస్తే సకల బ్రహ్మాండాన్ని విష్ణుమూర్తికి దానం చేసిన ఫలం లభిస్తుందని విశ్వసిస్తారు. ఉత్తరాయణం దేవతలకు ప్రీతికరం. స్వర్గస్థులైన కుటుంబ పెద్దలను తలచుకుంటూ పితృదేవతలకు సద్గతులు కలగాలని సంక్రాంతి నాడు తర్పణాలు విడుస్తారు.

ఈ రోజున పిండిపదార్థాలుగా చక్కెర పొంగలి, గారెలు, బూరెలు, పండ్లను నైవేద్యంగా సూర్యభగవానుడికి, పితృదేవతలకు పెట్టి ప్రార్థించుకుంటే మోక్షమార్గము, సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని పెద్దలు చెబుతారు.

సంక్రాంతి పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో జరుపుకొంటారు. ఉత్తర భారతంలో సంక్రాంతిని మాఘీ అని పిలుస్తారు. మధ్యభారతంలో సుకరాత్‌ అని, అస్సామ్‌లో మఘ్‌ బిహు అని, తమిళనాడులో పొంగల్‌ అని అంటారు. మూడోరోజు కనుమ. ఇది ప్రధానంగా వ్యవసాయదారుల పండుగ. కనుమనాడు పశువులను పూజిస్తారు.

ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో లోగిళ్లు కొత్త అల్లుల్లతో బంధుమిత్రులతో కళకళలాడతాయి. వివిధ వంటకాలు తయారు చేసుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో అరిసెలు, పాకుండలు, స‌కినాలు, మిటాయిలు, బొబ్బట్లు , నువ్వులు పిండితో చేసిన ప‌దార్ధాలు ఈ పండుగ‌కు ప్ర‌త్యేకం.. సాయంత్రం స‌మ‌యంలో బొమ్మ‌ల‌ను చ‌క్క‌గా అలంక‌రించి బొమ్మ‌ల కొలువు ఏర్పాటు చేస్తారు.

అలాగే సంక్రాంతి రోజున ముగ్గులు వేసి రంగులతో అందగా అలంకరించి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టడం ఆనవాయితి. పండగ రోజున ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను పెడితే ఇంట్లో లక్ష్మీ దేవిని ఆహ్వానించినట్టు అని విశ్వసిస్తుంటారు.

Related posts