ప్రముఖ నటుడు, రచయిత, విలక్షణ నటుడు, ప్రతి నాయకుడు, రచయిత, కవి, జర్నలిస్టు, ప్రసంగీకుడు గొల్లపూడి మారుతీరావు ఈ రోజు మధ్యాహ్నాం కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపుడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. “గొల్లపూడి మారుతిరావు గారు ఆకస్మిక మరణంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాను. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఆయన అందించిన సహకారం అసమానం. మేము ఒక మంచి రత్నాన్ని కోల్పోయాం. గొల్లపూడి కుటుంబానికి నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను. గొల్లపూడి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను” అని మహేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయన రచన…. ఆయన నటన…. ఎప్పటికీ మరువలేము….. గొల్లపూడి మారుతి రావు గారి ఆత్మ కి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను అని దర్శకుడు అనీల్ రావిపూడి ట్వీట్‌లో తెలిపారు.
ఇక ఆయన అంత్యక్రియలు ఆదివారం ఉదయం 11.30ని.లకి చెన్నైలో జరపనున్నారు. అభిమానుల సందర్శనార్ధం శనివారం భౌతిక దేహాన్ని స్వగృహానికి తరలించనున్నారు. గొల్లపూడి మృతితో ఆయన కుటుంబం శోక సంద్రంలో మునిగింది. ఆదివారం గొల్లపూడి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కుటుంబీకులు, బంధువులు విదేశాల నుంచి వచ్చే వరకు ఆసుపత్రిలోనే మృతదేహాన్ని ఉంచనున్నారు. గొల్లపూడికి ముగ్గురు కుమారులు ఉండగా, ఓ కుమారుడు రోడ్ యాక్సిడెంట్‌లో మృతి చెందడంతో చాలా కుంగిపోయారు. దివంగత కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ పేరుమీద,…. గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ ప్రతి ఏట ఆగష్టు 12 న ,ఉత్తమ ప్రతిభను కనపరిచిన డెబ్యూ డైరెక్టర్ కి గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డును ప్రదానం చేస్తుంది.