జస్టిస్ రమణ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం చేస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్‌కోవింద్ కీలక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి. రమణ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ లో ఇవాళ ఉదయం 11 గంటలకు జస్టిస్ ఎన్వీ రమణ తో పాటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. అయితే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్ వి రమణ పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా శుభాభినందనలు తెలిపారు చిరంజీవి. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ వ్యవసాయ కుటుంబంలో పుట్టి.. విద్యార్థి దశ నుంచే రైతుల పక్షాన నిలిచి పోరాడిన రైతు బిడ్డ ఎన్ వి రమణ అని కొనియాడారు. సామాన్యుల కష్టం తెలిసిన పాత్రికేయుడని..గత 40 ఏళ్లుగా న్యాయ క్షేత్రంలో నిత్య కృషీవలుడు శ్రీ రమణ గారని పేర్కొన్నారు. అత్యున్నత న్యాయస్థానం లో అత్యున్నత పదవి 55సంవత్సరాల తరువాత చేపడుతున్న ఈ తెలుగు బిడ్డను చూసి ఆయన పుట్టిన ఊరు పులకించిపోతుందని చిరంజీవి తెలిపారు.