telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రానా, తమన్నా, ప్రకాష్ రాజ్ లకు హైకోర్టు నోటీసులు

Online-Gambling

ఆన్‌లైన్ రమ్మీ వ్యవహారంలో తమిళనాడు హైకోర్టు పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ రమ్మీని నిషేధించాలని కోరుతూ మదురై కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఆన్‌లైన్‌‌లో రమ్మీ ఆడుతూ అనేక మంది తమ డబ్బు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై మదురై కోర్టు మంగళవారం (నవంబర్ 3) విచారణ చేపట్టింది. తెలంగాణలో ఆన్‌లైన్‌ రమ్మీపై ఇప్పటికే నిషేధం విధించారని గుర్తు చేసిన ధర్మాసనం.. తమిళనాడులో ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధానికి ఏవైనా చర్యలు తీసుకున్నారా? అని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఆన్‌లైన్ జూదం డబ్బంతా ఎక్కడికి పోతోందని ప్రశ్నించింది. ఆన్‌లైన్‌ జూదం నిషేధానికి 10 రోజుల్లో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను నవంబర్ 19కి వాయిదా వేసింది. ఆన్‌లైన్‌‌లో రమ్మీ నిర్వహిస్తున్న పలు సంస్థలకు ప్రచారకర్తలుగా ఉన్న క్రీడా, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులకు మదురై న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వీరిలో బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరభ్‌ గంగూలీతో పాటు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, సినీ ప్రముఖులు ప్రకాశ్‌రాజ్‌, తమన్నా, రానా, సుదీప్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అభిమానుల మీద ప్రభావం చూపిస్తాయని తెలిసినా ఇలాంటి వాటికి ఎందుకు ప్రచారకర్తలుగా ఉన్నారని ప్రశ్నిస్తూ వారి నుంచి వివరణ కోరింది. ఈ మేరకు దీనిపై సమాధానం చెప్పేందుకు పది రోజుల గడువు ఇచ్చింది. ఈ నెల 19 లోగా స్పందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది మద్రాస్ కోర్టు.

Related posts