ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ కేవలం రెండంటే రెండు నిమిషాల్లో 1.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 7,572 కోట్లు) నష్టపోయారు. న్యూయార్క్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే, టెస్లా ఐఎన్సీ ఈక్విటీ వాటాలు దారుణంగా పడిపోయాయి. దీంతో బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ గణాంకాల ప్రకారం ఆయన నికర ఆస్తి విలువ 23.4 బిలియన్ డాలర్ల నుంచి 22.3 బిలియన్ డాలర్లకు తగ్గింది.
ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్న టెస్లా, ఈ సంవత్సరం తొలి మూడు నెలల వ్యవధిలో అమ్మకాలను ఏ మాత్రం పెంచుకోలేక పోయింది. 2018 అక్టోబర్ – డిసెంబర్ మధ్య కాలంలో 90,966 యూనిట్లను విక్రయించిన సంస్థ ఈ జనవరి – మార్చి మధ్య 63 వేల యూనిట్లను మాత్రమే అమ్మింది. ఈ గణాంకాలు బహిర్గతం కాగానే, టెస్లా పై ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించగా, భారీ ఎత్తున ఈక్విటీలు అమ్మకానికి వచ్చాయి.
ఎలాన్ మస్క్ మొత్తం ఆస్తుల్లో దాదాపు 10 బిలియన్ డాలర్లు టెస్లా నుంచి వచ్చినవే. మిగతా 13 బిలియన్ డాలర్లు రాకెట్ బిజినెస్ చేస్తున్న స్పేస్ ఎక్స్ ప్రోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ నుంచి వచ్చింది.