తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల తేదీ ఖరారైంది. అక్టోబరు 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్రమశిక్షణ సంఘం స్పష్టం చేసింది.
ఇటీవల ఆన్‌లైన్ వేదికగా ‘మా’ సర్వసభ్య భేటీ జరిగింది. మా కార్యవర్గ ఎన్నికల నిర్వహణ అంశంపై ఈ సందర్భంగా ప్రధానంగా చర్చ జరిగింది. క్రమశిక్షణ కమిటీ ఎలా చెబితే అలా చేస్తామని ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్ కూడా తన అభిప్రాయాన్ని ప్రకటించారు.
‘మా’ నిబంధనల ప్రకారం 21 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని సినీ నటుడు, ‘మా’ అధ్యక్ష అభ్యర్థి ప్రకాష్‌రాజ్ సూచించారు. అయితే, ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా ఎన్నికలు నిర్వహించడానికి కొంత సమయం అవసరమని క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడింది. సెప్టెంబరు రెండో వారం నుంచి అక్టోబరు రెండో వారం మధ్యలో ఏ తేదీ అనువుగా ఉంటే అప్పుడు నిర్వహిస్తామని తెలిపింది.
ఇందులో భాగంగా అక్టోబరు 10వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని ‘మా’ క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్ వెల్లడించనున్నారు.
కాగా..ప్రస్తుతం అధ్యక్ష బరిలో ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు, హేమలు ఉన్నారు. చివరి నిమిషంలో ఎవరైనా బరిలోకి దిగుతారా? లేక ఎవరినైనా ఏకగ్రీవం చేస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది. అలాగే, నటీనటుల సమస్యల పరిష్కారంతో పాటు, ‘మా’ నూతన భవనం ప్రధాన అజెండాగా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో చివరి వరకూ ఎవరు పోటీలో ఉంటారు? ఎవరు విజయం సాధిస్తారు? అన్నదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
నేను ఆ విషయం బయటపెట్టడమే మహారాష్ట్ర సీఎంకు ఉన్న సమస్య : కంగనా