లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో సడలింపు ఇచ్చింది. మున్సిపల్ నివాస ప్రాంతాల్లో కొన్ని దుకాణాలను తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. దీనికి సంబంధించి ఉత్వర్వులను నిన్న అర్ధరాత్రి కేంద్ర హోం శాఖ వెలువరించింది. అక్కడక్కడ విడిగా ఉన్న దుకాణాలను 50 శాతం మంది సిబ్బందితో, అవసరమైన జాగ్రత్తలతో తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్లో సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధరించి, 50 శాతం మంది సిబ్బందితో వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించవచ్చని తెలిపింది.
మున్సిపాలిటీల్లోని మల్టీ బ్రాండ్, సింగిల్ బ్రాండ్ మాల్స్ లోని దుకాణాలు, మార్కెట్ ప్రదేశాలను మే 3 వరకు మూసేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లు, హాట్ స్పాట్లలో మాత్రం అన్ని దుకాణాలను మూసే ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సంతకం చేసిన ఉత్తర్వులు నిన్న అర్ధరాత్రి వెలువడ్డాయి.