ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భారీ స్థాయిలో 1,26,728 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి, పరీక్షలను నిర్వహించి, రెండు రోజుల క్రితం ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈరోజు సచివాలయ పరీక్షలో పాసైన వారి వివరాలతో పాటు జిల్లాల వారీగా షార్ట్ లిస్ట్ జాబితాను కలెక్టర్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు. రిజర్వేషన్ల మేరకు, జిల్లాల వారీగా పోస్టుల ఆధారంగా జిల్లా సెలక్షన్ కమిటీ పరిశీలించి ఉద్యోగాలకు అర్హులైన వారి వివరాలను ఉదయం 11 గంటల సమయంలో వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు. జాబితాలో ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి జిల్లా సెలక్షన్ కమిటీ కాల్ లెటర్లను అభ్యర్థుల మెయిల్ కు పంపిస్తారు. షార్ట్ లిస్టులో పేరు ఉన్న అభ్యర్థులు ఈరోజు, రేపు ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ప్రతి జిల్లాలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేశారు. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు 23, 24, 25 తేదీలలో జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు అవుతారు. జిల్లా సెలక్షన్ కమిటీలు అన్ని ధృవీకరణ పత్రాలు చూపించిన అభ్యర్థులకు అదే రోజు సాయంత్రం అపాయింట్ మెంట్ లెటర్లు ఇస్తుంది. లెటర్లు అందుకున్న అభ్యర్థులు అక్టోబర్ 1, 2 తేదీలలో జరిగే శిక్షణ కార్యక్రమానికి హాజరై అక్టోబర్ 2వ తేదీన విధుల్లో చేరాల్సి ఉంటుంది. అక్టోబర్ 2వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభం కాబోతున్నాయి. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల సమయంలోనే భారీ స్థాయిలో యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ఉండటం పట్ల యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాహుల్ ప్రధాని కాలేరు..ఏపీకి హోదా ఎలా ఇస్తారు: ఉండవల్లి