జీహెచ్‌ఎంసీ వర్షాకాలానికి ముందే చేపట్టాల్సిన చర్యలను ఆలస్యంగానైనా ప్రారంభించింది. ఫాగింగ్.. యాంటి లార్వా ఆపరేషన్లను ఉధృతం చేయడంతో పాటు అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన అధికారులు.. తాజాగా జర్మనీ సాంకేతికత వినియోగం ద్వారా దోమల పని పట్టాలని నిర్ణయించారు. గ్రేటర్‌లో దోమలు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి? ఏ రకం దోమలు? వాటిలో రోగాలు వ్యాప్తి చేసేవి ఏవి? అన్నది గుర్తించి, నివారించేందుకు అధునాతన పరిజ్ఞానంతో పనిచేసే పరికరాలను వినియోగించనున్నారు. ప్రస్తుతం నమోదైన డెంగీ, మలేరియా కేసుల ఆధారంగా దోమల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్నారు. నగరంలో 410 మస్కిటో హై రిస్క్ ఏరియాలున్నాయి. కేసుల ఆధారంగా గుర్తించిన ప్రాంతాల్లోనే జీహెచ్‌ఎంసీ నివారణ చర్యలు ముమ్మరంగా ఉండడంతో రోజుకో కొత్త ఏరియా ఈ జాబితాలో చేరుతోంది.
ఒక దోమ దాదాపు అర కిలోమీటర్ వరకు ప్రయాణిస్తుందని అధికారులు చెబుతున్నారు. దీంతో నగరంలోని చాలా బస్తీలు, కాలనీలు దోమ కారక వ్యాధుల బారిన పడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే డెంగీ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో సీరియ్‌సగా స్పందించిన సర్కారు నివారణ చర్యలను ముమ్మరం చేయాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. దీంతో ఏ ప్రాంతంలో దోమలు ఎక్కువగా ఉన్నాయు? ఏ రకం దోమలు అధికంగా ఉన్నాయి? అన్నది స్మార్ట్ సర్వైలెన్స్ డివైజెస్ విధానం ద్వారా గుర్తించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. దోమల తీవ్రత ఎక్కువగా ఉందనుకుంటున్న ప్రాంతాల్లో స్మార్ట్ సర్వైలెన్స్ పరికరాలను అమరుస్తారు. ఆ డివైజ్‌లో దోమలను ఆకర్షించే ద్రావకం ఉంటుంది. విద్యుత్‌తో పనిచేసే పరికరం ఆన్ చేయగానే, లిక్విడ్ వాయు రూపంలో బయటకు వస్తుంది. ఇది దోమలను ఆకర్షిస్తుంది. కార్బన్ డయాక్సైడ్, శ్వాస, ఓ రకమైన వాసనలా ఉండే గాలితో మనుషులు ఉన్నారని భావించి పరికరం వద్దకు దోమలు వస్తాయి. డివైజ్‌లో ఉండే సెన్సార్ దోమలను గుర్తిస్తుంది. దానిని కంప్యూటర్/స్మార్ట్‌ఫోన్లకు అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు దోమల డేటాను నమోదు చేస్తారు.
జీహెచ్‌ఎంసీలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు కూడా పరికరాలను అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. దోమల్లో డెంగీ కారక ఏడిస్ ఈజిప్టైన్, మెదడు వాపు వ్యాధికి కారణమయ్యే క్యూలెక్స్, మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే దోమలు ఎన్ని? వాటిలో ఆడ, మగ వివరాలనూ పరికరం గుర్తిస్తుంది. సాధారణంగా ఏడిస్ ఈజిప్టైన్ దోమలో ఉండే ఆల్బోపిక్టస్ వైరస్ ద్వారా డెంగీ వ్యాప్తి చెందుతుంది. ఇలా వ్యాధి కారక వైర్‌సలు ఉన్న దోమలనూ పరికరం గుర్తిస్తుంది. కనీసం 24 గంటలపాటు పరికరం పనిచేస్తే దోమల లెక్కలు తేలే అవకాశం ఉంటుంది. ఆ డేటా ఆధారంగా దోమల తీవ్రత, రకాలను బట్టి ఆయా ప్రాంతాల్లో ఫాగింగ్, ఇండోర్ రెసిడ్యుయల్ స్ర్పే, పవర్ స్ర్పే వంటి నివారణ చర్యలను ముమ్మరం చేయనున్నారు.
“ఆయుష్మాన్ భవ”ను తెలంగాణలో అమలు చేయడం: ఎంపీ ధర్మపురి అరవింద్