telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అత్యంత విషమంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి

SPB

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెన్నై ఎంజీఎం హాస్పిటల్ గురువారం సాయంత్రం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటలుగా ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని.. ఆయనకి ఎక్మో, ఇతర లైఫ్ సపోర్ట్‌పై చికిత్స అందిస్తున్నామని హాస్పిటల్ పేర్కొంది. తమ నిపుణుల బృందం బాలు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని వెల్లడించింది. గత 40 రోజులుగా చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఎస్పీ బాలు. ఈ నెల 19 వరకూ డాక్టర్లు హెల్త్ బులెటిన్ ఇచ్చారు. 22న అంటే మొన్న ఎస్పీ చరణ్‌ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్పత్రి నుంచి వెళ్లిపోడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఓ పోస్ట్ చేశారు. దీంతో బాలు కోలుకున్నట్లేనని, రేపో మాపో డిశ్చార్జ్ అవుతారని భావించారంతా. కానీ ఈలోగా ఆయన మళ్లీ ఆస్త్వస్థతకు గురయ్యారన్న వార్తలు రావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. మొదట జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో బాధపడిన బాలు.. ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు నుంచీ ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆ తరవాత వెంటిలేటర్‌తో పాటు ఎక్మో (ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సపోర్ట్‌తో చికిత్స చేస్తున్నారు. ఇప్పుడు కూడా వెంటిలేటర్‌పైనే ఆయనకు చికిత్స అందుతున్నట్టు సమాచారం.

Related posts