telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినిమా వాళ్లకు గుడ్ న్యూస్… షూటింగ్స్ ప్రారంభానికి మార్గదర్శకాలు!

కరోనా కారణంగా ఆగిపోయిన పలు చిత్రాల షూటింగ్స్ ఇప్పుడు మొదలు కాబోతున్నాయి. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ , నిర్మాతల మండలి, దర్శకుల సంఘం, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా బుధవారం ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం అయ్యాయి. ఇందులో జెమినీ కిరణ్, కె.ఎల్. దామోదర ప్రసాద్, ముత్యాల రాందాసు, విజయేందర్ రెడ్డి, నరేశ్, జీవిత, పల్లి కేశవరావు, సురేందర్ రెడ్డి, ప్రసన్న కుమార్, భరత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 12న తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వారు ‘మా’, దర్శకుల సంఘంతో ఓ సమావేశం ఏర్పాటు చేయమని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ను అడిగిన విషయాన్ని గౌరవ కార్యదర్శి కె.ఎల్. దామోదర ప్రసాద్ తెలియచేశారు. అలానే ఆ సందర్భంగా నిర్మాతల మండలి చర్చించమని కోరిన అంశాలను ఈ సమావేశంలో హాజరైన సభ్యులకు దామోదర ప్రసాద్ విడమర్చి చెప్పారు. వాటిని కూలంకషంగా పరిశీలించిన సమావేశం పలు నిర్ణయాలను తీసుకుంది. రెండున్నర నెలల తర్వాత షూటింగ్స్ ప్రారంభం అవుతున్న సందర్భంగా నటీనటులు, సాంకేతిక నిపుణులు కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. అవి పూర్తి అయిన తర్వాతే కొత్త సినిమాలకు కమిట్ కావాలని కోరారు. అలానే బాలెన్స్ వర్క్ ను వీలైనంత తక్కువ రోజులలో పూర్తి చేయాలని నిర్మాతలను అడుగుతున్నారు. షూటింగ్ లో పాల్గొనే నటీనటులు, సాంకేతిక నిపుణులు వాక్సిన్ తీసుకున్నట్టు డిక్లరేషన్ ఇవ్వాలని తెలిపారు. చిత్రసీమకు చెందిన ప్రతి ఒక్కరూ ఒక డోస్ వాక్సినేషన్ అయిన తీసుకోవాలనే నిబంధనను పెట్టారు. అలానే యూనియన్ లోని సభ్యులకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించాలని, ఆ బాధ్యతను సంబంధిత యూనియన్లు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తున్న మార్గదర్శకాలను నిర్మాతలు పాటించాలని చెప్పారు. ఒకవేళ ఎవరైనా వీటిని అతిక్రమించినా, అమలు చేయకపోయినా ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి దృష్టికి తీసుకోవాలని కోరారు. ఈ నిర్ణయాలపై దర్శకుల సంఘం వెంటనే సుముఖుత వ్యక్తం చేసింది.

Related posts