telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భారీ వర్షాలకు గోదావరికి వరద ఉదృతి.. అధికారులను అప్రమత్తంగా ఉండాలన్న ఏపీసీఎం…

rescue teams in action in AP on huge rains

విదేశీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. గోదావరి వరద ఉద్ధృతిపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముంపు బాధితులను రక్షిత ప్రాంతాలకు తరలించి భోజన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసరాలు అందించాలన్నారు. ఇప్పటికే ముంపు బాధితులకు 25 కిలోల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్‌, కేజీ కందిపప్పు, లీటర్‌ నూనె, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు పంపిణీ చేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాజమండ్రి అర్బన్ పరిధిలో ఉన్న రెండు లంక గ్రామాలను వరద ముంచెత్తడంతో పడవల్లో పునరావాస కేంద్రాలకు తలిస్తున్నారు. స్థాయికి మించి గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఎటువంటి ప్రమాదం జరక్కుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో గత రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో శబరి, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఏజెన్సీ గ్రామాలు నీటమునిగాయి. పోలవరం కాఫర్ డ్యామ్ బ్యాక్ వాటర్‌తో గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 32 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలతో జనజీవనం స్థంభించింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. ముంపు బాధితులను ఆదుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

తెలంగాణలో మరో నాలుగైదు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో, ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు నిండటంతో.. గేట్లన్నీ ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో గోదావరిలో వరద ప్రవాహం పెరిగింది.

Related posts