కేరళ సమస్యలను కూడా లోక్ సభలో ప్రస్తావిస్తానని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ నుంచి ఓడిపోయిన రాహుల్ కేరళ లోని వయనాడ్ నుంచి 4.31 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఈ నేపథ్యంలో రాహుల్ నేడు కూడా వయనాడ్ లోని కాల్పెట్టలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తనను భారీ మెజారిటీతో గెలిపించిన వయనాడ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
సిద్ధాంతాలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా నేను అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. వయనాడ్ లోని ప్రతీఒక్కరికీ నా ఇంటి తలుపులు తెరిచి ఉంటాయని తెలిపారు.వయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో వయనాడ్ తో పాటు రాష్ట్ర సమస్యలను కూడా లోక్ సభ లో ప్రస్తావిస్తానని రాహుల్ పేర్కొన్నారు.