ఆర్థిక మాంద్యంతో దేశాన్ని వెనక్కి నెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంలో 25 వేల బ్యాంక్ ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయని అన్నారు. దీని ద్వారా రూ. 3లక్షల కోట్లు దుర్వినియోగం అయ్యిందన్నారు. కశ్మీర్‌కి వెళ్లాలంటే సుప్రీంకోర్టు అనుమతితో వెలసిన దుస్థితి నెలకొందన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ వైఫల్యం మీద దేశంలో 650 కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టామని తెలిపారు.
దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిందని, 2014లో అధికారంలోకి రాగానే 10కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి 50 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. జమ్మూలో పరిస్థితుల అధ్యయనం కోసం వెళ్తే అక్కడ 5 గంటలు వెయిట్ చేయించి ఢిల్లీకి సీపీఎం నేతలతో పాటూ బలవంతంగా నన్ను వెనక్కి పంపారన్నారు. ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అనే నినాదానికే పరిమితమైందని, ఆచరణలో మాత్రం అందనంత ఎత్తులో ఉందని ఆజాద్ ఎద్దేవా చేశారు.