telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్యేలే పదవులను అమ్ముకుంటున్నారు….కడియం శ్రీహరి సంచలనం వ్యాఖ్యలు

సుదీర్ఘమైన చరిత్ర ఉన్న పార్టీ టీఆర్‌ఎస్‌. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడ్డ టీఆర్‌ఎస్‌.. మొదటి నుంచి అనేక ఆటుపోటులను ఎదుర్కొంది. రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించిన టీఆర్‌ఎస్‌.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉంది. అయితే.. 2014 నుంచి ఇప్పటి వరకు ఎదురులేని పార్టీగా ఎదగడమే గాక.. ఎన్నో విజయాలను అందుకుంది. కానీ దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత డీలా పడింది. ఇక అప్పటి నుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రామ మందిరం, బీజేపీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే సొంత పార్టీపై కూడా ఈటల లాంటి వారే సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని పదవులు అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఉద్దేశించి… కడియం శ్రీహరి చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. జనగామ జిల్లా జాఫర్గడ్ మండలం ఓబులపూర్ గ్రామంలో కబడ్డీ క్రీడల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. చేతకానివారు, ఒక్క రూపాయి సహాయం చేయనివారు కూడా మాట్లాడుతున్నాడని… చెల్లని రూపాయి గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదన్నారు. పనిచేసే వారిని నిరుత్సాహ పరుచడం కాదని, మగాడైతే ఆర్థిక సహాయం చేయాలన్నారని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు పదవి ఇప్పిస్తాననో, పనులు ఇప్పిస్తాననో… ఒక్కరి దగ్గర ఛాయ్ తాగినా, రూపాయి తీసుకున్న ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. పదవులు, పనులను అమ్ముకుంటూ.. సిగ్గులేకుండా మళ్లీ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నెత్తిమీద పది రూపాయలు పెడితే అమ్ముడు పోనివారు కూడా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో తాను చేసిన పనులు వారికి కనబడుతాలేవా అని ప్రశ్నించారు.

Related posts