మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ సమక్షంలో 300 మంది బీజేపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా విశాఖలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పని అయిపోయిందని అనుకుంటున్న సమయంలో ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలు తమ పార్టీలో చేరడం శుభపరిణామంగా అభివర్ణించారు. ఈ నెల 19 నుంచి వార్డుల వారీగా 45 రోజుల పాటు ప్రజా చైతన్యయాత్రలు నిర్వహిస్తామని చెప్పారు.
భవిష్యత్తులో అన్ని పార్టీల నుంచి టీడీపీలోకి చేరికలు ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత చేరికలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు మరింత బలాన్ని చేకూర్చాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.