విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్ ప్రశంసనీయమని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సొంత ఖర్చులతో వేలాది మంది భారతీయులు వెనక్కి వస్తున్నారని తెలిపారు. అయితే గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోల్పోయి అక్కడే చిక్కుకుపోయిన వేలాది మంది వలస కార్మికులు కష్టాలు పడుతున్నారని జగన్ చెప్పారు. స్వదేశానికి రావడానికి ప్రయాణ ఖర్చును భరించే స్థితిలో వారు లేరని తెలిపారు.
కువైట్ లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన కార్మికులను స్వదేశానికి రప్పించేందుకు విమాన ఏర్పాట్లను చేయాలని కోరుతూ విదేశాంగ మంత్రి జైశంకర్ కు ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాలకు నేరుగా విమానాలను ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. ఇమ్మిగ్రేషన్ ఫీజును మాఫీ చేసి, వారందరికి ఎగ్జిట్ క్లియరెన్స్ ను మన దేశ రాయబార కార్యాలయం ఇచ్చిందని జగన్ చెప్పారు. వారి ప్రయాణ ఖర్చును భరించేందుకు కువైట్ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని తెలిపారు.