telugu navyamedia
సినిమా వార్తలు

‘ఇట్లు అమ్మ’కు ప్రేమతో అవార్డుల వెల్లువ..

‘అంకురం’సినిమాతో తనకంటూ ఒక ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్న దర్శకుడు సీ ఉమా మహేశ్వరరావు తాజాగా తెరకెక్కించిన గొప్ప సందేశాత్మక చిత్రం ‘ఇట్లు అమ్మ’. అల‌నాటి నటి రేవతి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని డా: బొమ్మకు మురళి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఇటీవల సోని ఓటీటీ ద్వారా విడుదలైన ఈ చిత్రానికి భారీ స్పందన లభించింది. అంతేకాదు అవార్డులు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికి 47 అవార్డులు వరించాయి. ఈ చిత్రానికి మంచి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు మూవీ యూనిట్‌ కృతజ్ఞతలు చెప్పింది. ఈ చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అనూహ్య పరిస్థితుల్లో బిడ్డను కోల్పోతుంది సరస్వతి(రేవతి). ఏ పాపమూ ఎరుగని అసలు చీమకు కూడా హానీ తలపెట్టని తన బిడ్డ అర్థాంతరంగా ఎందుకు మాయమైపోయాడో తెలియక తల్లడిల్లిపోతుంది. తన కొడుకును ఎవరు, ఎందుకు చంపారనే ప్రశ్నలు ఆ ‘పిచ్చి తల్లి’ని నిద్ర పోనివ్వవు. అందుకే ఎలాగైనా తన కొడుకును పొట్టనపెట్టుకున్న వారి గురించి తెలుసు కోవాలనుకుని రోడ్డు మీదికి వస్తుంది. ఈ సత్యశోధనలో తల్లిగా ఆమెకెదురైన అనుభవాలు ఏంటి? ఆ తల్లి హంతకుడిని కనుక్కోగలిగిందా, తన కొడుకుతో పాటు, నేరస్తుడికి పట్టిన దురవస్థకు కారణాలను అన్వేషించే క్రమంలో ఆమె తీసుకున్న నిర్ణయాలే ‘ఇట్లు అమ్మ’మూవీ ..

చిత్ర నిర్మాత-బొమ్మకు క్రియేషన్స్ అధినేత డా: బొమ్మకు మురళి మాట్లాడుతూ…”రేవతి గారి నటన, ఉమామహేశ్వరావు దర్శకత్వ ప్రతిభ, మధు అంబట్ ఛాయాగ్రహణం, ప్రవీణ్ పూడి ఎడిటింగ్, సన్నీ ఎమ్.ఆర్ సంగీతం, గోరేటి వెంకన్న గానం-సాహిత్యం, సుచిత్ర చంద్రబోస్ కొరియోగ్రఫీ తదితర అంశాలు “ఇట్లు అమ్మ” చిత్రం ఓ దృశ్యకావ్యంగా తీర్చిదిద్దాయి.

ఇంత గొప్ప చిత్రం మా “బొమ్మకు క్రియేషన్స్”లో నిర్మాణం కావడం మాకెంతో గర్వకారణం. రేవతి గారు “ఇట్లు అమ్మ” చిత్రం తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పడం బట్టి ఈ చిత్రాన్ని అంచనా వేయవచ్చు. ఈ చిత్రానికి అవార్డులతోపాటు రివార్డులు కూడా మా అంచనాలను మించి వస్తున్నాయి. ఈ చిత్ర నటీనటులు-సాంకేతిక నిపుణులు అందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు” అన్నారు.

Related posts