గతంలో చెప్పిన విధంగానే భారత వైమానిక దళం(ఐఏఎఫ్) జులై 31న నూతన మొబైల్ గేమ్‌ను విడుదల చేయబోతోంది. ఈ మేరకు ఐఏఎఫ్ అధికారిక ట్విటర్ ఖాతా నుంచి ప్రకటన విడుదల చేసింది. ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్: ఎ కట్ ఎబౌ’ అనే పేరుతో గేమ్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ గేమ్‌ను ఆడేవారికి నిజంగా విమానం నడిపిన అనుభవాన్ని కలుగజేసేవిధంగా రూపొందించారు. భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాత్రను కూడా గేమ్‌లో అందుబాటులో ఉంచారు. ఈ గేమ్ ఆడేవారు యుద్ధ విమానాలు, ఛాపర్స్, కార్గో విమానాలు వంటి వాటితో పాటు కింద నుంచి శత్రు విమానాలపై దాడులు చేసిన అనుభూతి చెందవచ్చు. ఇందులో మొదట్లో సింగిల్ ప్లేయర్‌కు మాత్రమే ఆడేందుకు అవకాశం ఉంటుందని, అనంతరం వచ్చే అప్‌డేట్‌లో మల్టీప్లేయర్స్ ఆడేందుకు వీలుంటుందని తెలిపింది. ఈ విధంగా ఐఏఎఫ్ గేమ్‌లోని విశేషాలను వెల్లడించింది.
ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్స్‌కు అందుబాటులో ఉంటుంది. ఈ గేమ్‌ను త్రేయి మిలిటరీ గేమ్స్ రూపొందించింది. వీరు ఇప్పటికే ‘గార్డియన్స్ ఆఫ్ ది స్కై’ వంటి మిలిటరీ గేమ్స్‌ను రూపొందించారు. 2019 ఫిబ్రవరిలో పాక్ విమానాలను ఎదుర్కోవడానికి మిగ్ విమానంలో బయలుదేరిన భారత వింగ్ కమాండర్ అభినందన్ విమానం కుప్పకూలడంతో పాక్‌కు దొరికిన సంగతి తెలిసిందే. రెండు రోజుల ఉత్కంఠ పరిణామాల అనంతరం పాక్ భారత వింగ్ కమాండర్‌ను వదిలిపెట్టింది.