హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి బైక్ ను లారీ ఢీకొట్టింది. అతన్ని రెండు కిలోమీటర్లు ఈడ్చుకుపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయాలతో తప్పించుకున్నారు. ఎర్రగడ్డకు చెందిన ఎం.సాయికృష్ణ బుధవారం తన స్నేహితులతో కలిసి ఓ ఫంక్షన్‌కు హాజరయ్యాడు. గురువారం తెల్లవారుజామున 3.40 గంటల ప్రాంతంలో సాయి తన స్నేహితులతో కలిసి జీవీకే మాల్ మీదుగా ఖైరతాబాద్ వైపు బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ సమీపంలోకి రాగానే అదుపు తప్పిన బైక్ కిందపడింది.అదే సమయంలో వెనక నుంచి వేగంగా వస్తున్న లారీ సాయికృష్ణ పైనుంచి దూసుకెళ్లింది.
అదే బైక్‌పై ఉన్న సాయి స్నేహితులు గోగుల ఆదిత్య, బి.ప్రశాంత్‌లు స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. ఇక, సాయిని తొక్కించుకుంటూ వెళ్లిపోయిన లారీ రెండు కిలోమీటర్ల తర్వాత ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఆగగా సాయి తీవ్ర గాయాలతో కనిపించాడు. వెంటనే అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.