telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

హర్యానా : .. స్వతంత్ర అభ్యర్థులు .. బీజేపీ వైపే..

haryana independents supports bjp

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్ ఏర్పడటంతో, ఎవరి పాము వాళ్ళు కదుపుతున్నారు. ముఖ్యంగా మెజారిటీకి ఆరు స్థానాల దూరంలో నిలిచిపోయిన బీజేపీ… స్వతంత్ర ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఇప్పటికే ఈ దిశగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో రానియా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రంజిత్ సింగ్ బీజేపీకి మద్దతు పలికారు. ఈ మేరకు హర్యానా బీజేపీ ఇంఛార్జ్ అనిల్ జైన్‌తో కలిసి ఆయన వీడియా సందేశం విడుదల చేశారు. హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటు కోసం నేను బీజేపీకి మద్దతు ఇస్తున్నాను. నేను రానియా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించాను. బీజేపీకి, మోదీ ప్రభుత్వ విధానాలకు నేను సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను..అని ఆయన పేర్కొన్నారు.

రానియాకి చెందిన రంజిత్ సింగ్ వాస్తవానికి చౌతాలా వర్గానికి చెందిన వారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి, హర్యానా లోక్‌హిత్ పార్టీ అభ్యర్థి గోవింద్ కందాపై 19,431 ఓట్ల తేడాతో విజయం సాధించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకు గానూ బీజేపీ 40 చోట్ల విజయం సాధించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 47 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి మరిన్ని స్థానాల్లో గెలిచేలా విస్తృత ప్రచారం చేసినప్పటికీ ప్రయోజనం దక్కలేదు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ 31 స్థానాలు, జేజేపీ 10 స్థానాలు గెలుచుకున్నాయి. గత ఎన్నికల్లో 19 స్థానాలు గెలుచుకున్న అవిభక్త ఐఎన్ఎల్డీ పార్టీ తాజా ఎన్నికల్లో ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఇతరులు ఎనిమిది చోట్ల విజయం సాధించారు.

Related posts