రైతు బిల్లులకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారు. బిల్లులు రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. అయితే.. రైతుల ఆందోళనలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. నూతన చట్టాలపై రైతుల్లో ఉన్న అపోహలను, భయాలను దూరం చేస్తామని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమిత్ షా తెలిపారు. అలాగే కనీస మద్దతు ధరపై కూడా రైతులకు భరోసా ఇస్తామని ఆయన పేర్కొన్నారు. కనీస మద్దతు ధర, మార్కెట్ కమిటీల గురించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయా సీఎంలతో రైతులకు భరోసా కల్పిస్తామన్నారు. అయితే.. నూతన చట్టాలను మాత్రం వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని అమిత్ షా స్పష్టం చేశారు. కాగా, ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో రైతు సంఘాల నేతలతో ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో చర్చలు జరపబోతున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ చర్చలు జరగనున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది.
previous post