telugu navyamedia
తెలంగాణ వార్తలు

విమానంలో ఛాతీ నొప్పి బాధితుడికి గవర్నర్ తమిళిసై అత్యవసర చికిత్స..

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. తను ప్రయాణిస్తున్న విమానంలో తీవ్ర అస్వస్థతకు గురైన వ్యక్తికి అత్యవసర చికిత్స అందించి అందరి మన్ననలు అందుకున్నారు.

గవర్నర్‌ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ రాజ‌కీయాల్లోకి రాక‌ముందు డాక్టర్ అనే విషయం తెలిసిందే. రాజ‌కీయాల్లోకి వచ్చాక తమిళిసై వైద్యవృత్తిని పక్కనపెట్టి గవర్నర్ గా బిజీ అయిపోయారు. ఈక్రమంలో ఆమె అనుకోకుండా డాక్టర్ గా మారారు.

వ్యక్తిగత పనుల నిమిత్తం వారణాసి వెళ్లిన గవర్నర్‌ శుక్రవారం అర్ధరాత్రి ఢిల్లీ- హైదరాబాద్‌ ఇండిగో ఫ్లైట్‌లో తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈ సమయంలో తోటి ప్రయాణికుల్లో ఒకరు ఛాతీ నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన విమాన సిబ్బంది.. ప్రయాణికుల్లో ఎవరైనా డాక్టర్లున్నారా? అని అడిగారు.

దీంతో అదే విమానంలో ప్రయాణిస్తున్న తమిళిసై వెంట‌నే స్పందించారు.. నేరుగా బాధితుడి వద్దకు వెళ్లిప్రాథ‌మిక చికిత్స అందించారు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయటపడ్డాడు. ఈ సందర్భంగా సదరు బాధితుడితో పాటు తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది తెలంగాణ గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా సరైన సమయంలో స్పందించి ప్రయాణికుల రక్షణగా నిలిచిన విమాన సిబ్బందిని తమిళిసై అభినందించారు. ‘విమానంలో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. అదేవిధంగా విమాన ప్రయాణాల్లో డాక్టర్లు ఎవరైనా ఉంటే ముందే వారి వివరాలను అందుబాటులో ఉంచేలా ఒక కొత్త విధానం ఉండాలి.

అదేవిధంగా విమాన సిబ్బందికి సీపీఆర్‌పై కనీస అవగాహన ఉండేలా ట్రైనింగ్ ఇవ్వాలి. వారితో పాటు సామాన్యులు కూడా సీపీఆర్‌పై అవగాహన పెంచుకుంటే ఆపద సమయంలో ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉంటుంది’ అని గ‌వ‌ర్న‌ర్‌ సూచించారు..

Related posts