telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ‌లో మ‌రో 13 కొత్త మండ‌లాలు..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త‌గా పదమూడు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు అనేక మండలాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి డిమాండ్లు వచ్చాయి.

ప్రజా ఆకాంక్షలను, స్థానిక ప్రజల అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు.

సీఎం ఆదేశాలమేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఈ కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించిన ఏవైనా అభ్యంతరాలు, వినతులను ఉంటే సంబంధిత జిల్లాల కలెక్టర్లకు 15 రోజుల్లోగా అందించాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

కొత్త మండలాలు ఇవే..

*నారాయణపేట జిల్లా.. గుండుమల్, కొత్తపల్లె మండలాలు(నారాయణపేట రెవెన్యూ డివిజన్ పరిధి)
*వికారాబాద్ జిల్లా.. దుడ్యాల్ మండలం ( తాండూర్ రెవిన్యూ డివిజన్ పరిధి)
*మహబూబ్ నగర్ జిల్లా.. కౌకుంట్ల మండలం (మహబూబ్ నగర్ రెవిన్యూ డివిజన్ పరిధి)
*నిజామాబాద్ జిల్లా..ఆలూర్, డొంకేశ్వర్ మండలాలు (ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధి)
*నిజామాబాద్ జిల్లా.. సాలూర మండలం (బోధన్ రెవిన్యూ డివిజన్ పరిధి)
*మహబూబాబాద్ జిల్లా.. సీరోల్ మండలం (మహబూబాబాద్ రెవిన్యూ డివిజన్ పరిధి)
*నల్గొండ జిల్లా.. గట్టుప్పల్ మండలం (నల్గొండ రెవిన్యూ డివిజన్ పరిధి)
*సంగారెడ్డి జిల్లా.. నిజాంపేట్‌ మండలం (నారాయణ్ ఖేడ్ రెవిన్యూ డివిజన్ పరిధి)
*కామారెడ్డి జిల్లా.. డోంగ్లీ మండలం (బాన్సువాడ రెవిన్యూ డివిజన్ పరిధి)
*జగిత్యాల జిల్లా.. ఎండపల్లి మండలం (జగిత్యాల రెవిన్యూ డివిజన్ పరిధి)
*జగిత్యాల జిల్లా.. భీమారం మండలం (కోరుట్ల రెవెన్యూ డివిజన్ పరిధి)

Related posts