telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

విస్ట్రాన్ ఐఫోన్ కంపెనీ పై దాడి…రూ.440కోట్లు ఆస్తి నష్టం

కర్ణాటక కోలార్ జిల్లాలోని విస్ట్రాన్ ఐఫోన్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌‌పై శనివారం(డిసెంబర్ 12) జరిగిన దాడిలో రూ.440కోట్లు ఆస్తి నష్టం జరిగినట్లు ఆ కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. వేల సంఖ్యలో ఐఫోన్‌లు లూటీ అయినట్లు తెలిపింది. జరిగిన నష్టాన్ని ఇంకా పూర్తిగా అంచనా వేయాల్సి ఉందని పేర్కొంది. పోలీస్ స్టేషన్‌లో సమర్పించిన ఫిర్యాదులో ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దాడితో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్నవారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

విస్ట్రాన్ ప్లాంట్‌పై జరిగిన దాడిపై ఎస్పీ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ… శనివారం ఉదయం 6.30గంటలకు కొంతమంది ఉద్యోగులు ఈ దాడికి పాల్పడినట్లు చెప్పారు.వేతనాలకు సంబంధించిన సమస్య కారణంగానే దాడి జరిగినట్లు తెలిసిందన్నారు. ప్లాంట్‌లో రెండు షిఫ్టుల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారని… మొత్తం సుమారు 7వేల నుంచి 8వేల మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. పగలగొట్టారని,వాహనాలు,కంప్యూటర్లు,ల్యాప్‌టాప్స్ ధ్వంసం చేశారని పేర్కొన్నారు. దాడికి సంబంధించి ఇప్పటివరకూ 128 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కంప్యూటర్లు, ప్రింటర్లు, ల్యాప్‌టాప్స్, ఫ్లోర్, సీలింగ్స్, ఏసీ తయారీ పూర్తయిన స్మార్ట్‌ఫోన్లు.. ఇలా దేన్ని వదల్లేదని ఆ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

విస్ట్రాన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రశాంత్ మాట్లాడుతూ… ప్లాంట్‌లోకి బయటి వ్యక్తులు చొరబడి ఐరన్ రాడ్లు,కర్రలతో దాడులకు పాల్పడినట్లు చెప్పారు. ప్లాంట్‌కి ఉన్న నాలుగు ప్రధాన గేట్ల ద్వారా వారు లోపలికి వచ్చినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నప్పటికీ వారిపై కూడా దాడి చేశారన్న ఆరోపణలున్నాయన్నారు. అనంతరం ప్లాంట్‌లోకి చొరబడి కాంట్రాక్ట్ ఉద్యోగులతో కలిసి అద్దాలు,ఫర్నీచర్ ధ్వంసం చేశారని.. డాక్యుమెంట్స్‌ను చింపి పడేశారని అన్నారు. మొదట అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంపై దాడి చేసిన ఉద్యోగులు.. ఆ తర్వాత ప్రొడక్షన్ యూనిట్‌లోకి వెళ్లి లాకర్స్‌ను బద్దలు కొట్టినట్లు చెప్పారు.

భారత్‌లో ఏర్పాటైన మొట్టమొదటి ఐఫోన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ విస్ట్రాన్‌పై దాడిని కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్ కోలార్ ఎస్పీతో మాట్లాడారు. దాడికి పాల్పడినవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగులకు ఏవైనా సమస్యలు ఉంటే… సరైన వేదిక ద్వారా వాటి పరిష్కారానికి ప్రయత్నించాలని అన్నారు. అంతే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని కంపెనీపై దాడులకు పాల్పడటం సరికాదన్నారు. కర్ణాటక కార్మిక శాఖ మంత్రి శివరాం హెబ్బార్ మాట్లాడుతూ… విస్ట్రాన్ ప్లాంట్‌పై దాడిని తీవ్రంగా ఖండించారు. దాడులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు.

Related posts