పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ బీజేపీలో చేరుతున్నారంటూ గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరగుతోంది. మంగళవారం ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గత కొంతకాలంగా ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తో టచ్ లో ఉంటున్నారని, ఈరోజు అధికారికంగా ఆయన కమలం గూటికి చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న వివేక్ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వివేక్ టీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించారు.
చివరి క్షణాల్లో ఆ టికెట్ వివేక్ కాకుండా చెన్నూర్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన వెంకటేష్ నేతకు కేసీఆర్ పెద్దపల్లి ఎంపీ టికెట్ కేటాయించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వివేక్… అప్పటి నుంచి పార్టీ కి దూరంగా ఉంటూ వచ్చారు. టీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీనీ పటిష్టం చేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కడుపుతోంది. . ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నుంచి దూరమైన వివేక్ ని తమ పార్టీలోకి ఆహ్వానించింది. దానికి ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.