పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి ని పురస్కరించుకుని పర్యావరణ హితం కోసం జిహెచ్ఎంసి అధికారులు, సిబ్బందికి గణేష్ మట్టి విగ్రహాలు మేయర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ… తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో జరుపుకునే గణేష్ నవరాత్రి ఉత్సవాలను నగర వాసులు పర్యావరణాన్ని కాపాడే విధంగా పండుగను జరుపుకోవాలని కోరారు. నగర వ్యాప్తంగా జిహెచ్ఎంసి, హెచ్.ఎం.డి.ఏ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా 4.64 లక్షల మట్టి విగ్రహాలను ఈ నెల 16,17 తేదీల్లో జిహెచ్ఎంసి పరిధిలో అన్ని వార్డు ఆఫీసు ఆవరణలో ఉచితంగా పంపిణీ కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. జిహెచ్ఎంసి ద్వారా ఎల్బీనగర్ జోన్ 66,500, చార్మినార్ జోన్ 93,600, ఖైరతాబాద్ జోన్ 80,100, శేరిలింగంపల్లి జోన్ 42,900, కూకట్ పల్లి జోన్ 58,600, సికింద్రాబాద్ జోన్ 76,500 పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా హెచ్.ఎం.డి.ఏ ద్వారా 79,200, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా 75,000, జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో 46 వేల గణేష్ మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు మేయర్ వివరించారు.
ఈ పంపిణీ ప్రక్రియలో జిహెచ్ఎంసి ద్వారా 1.5 ఫీట్ల మట్టి విగ్రహాలు 10వేలు, 1 ఫీట్ 30 వేలు, 8 ఇంచ్ ల విగ్రహాలు 2,70,000 విగ్రహాలు, అదే విధంగా హెచ్.ఎం.డి.ఏ ద్వారా 8 ఇంచ్ ల విగ్రహాలు 79,200, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా 8 ఇంచ్ ల విగ్రహాలు 75,000 విగ్రహాలు పంపిణీ చేయనున్నారు. మరో 46 వేల మట్టి విగ్రహాలను జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ ద్వారా ఆయా ప్రదేశాల్లో పంపిణీ చేయనున్నారు. మొత్తం వార్డు ఆఫీస్ ల ద్వారా పంపిణీ చేసే మట్టి విగ్రహాలు జిహెచ్ఎంసి, హెచ్.ఎం.డి.ఏ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు కలుపుకుని మొత్తం 4,64,200 మట్టి విగ్రహాలను జిహెచ్ఎంసి పరిధిలో పంపిణీ చేస్తామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
మట్టి వినాయక విగ్రహాల పంపిణీ లో అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ఎస్.ఈ కోటేశ్వరరావు, సి.ఎం.ఓ.హెచ్ డాక్టర్ పద్మజా తదితరులు పాల్గొన్నారు.
——————————————–
– సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీచేయడమైనది.