telugu navyamedia
తెలంగాణ వార్తలు

కేసీఆర్ కర్రు కాల్చి వాత పెట్టే సమయం వచ్చింది -ఈటల రాజేందర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

హుజూరాబాద్‌లో  కేసీఆర్‌ను గుద్దితే ఎక్కడో పడ్డారు.. ఆ భాగ్యం హుజురాబాద్‌కి దక్కింద‌ని మళ్ళీ ఇపుడు నల్గొండకు దక్కబోతుంద‌ని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సెటైర్లు వేశారు.

యాదగిరిగుట్టలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సభలో ఈటల మాట్లాడారు ..గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో ఏదైనా సమస్య వస్తే ప్రగతి భవన్‌లో కానీ సచివాలయంలో కానీ కలిశారా అంటూ ప్రజలను ప్రశ్నించారు.

ప్రాచీన కాలంలో రాజులు కూడా మారు వేషంలో గుర్రాల మీద , ఏనుగుల మీద ప్రజల కష్టాలు తెలుసుకునేవారని .. కానీ ఈ రాజు ( కేసీఆర్‌) మాత్రం ఉంటే ప్రగతిభవన్‌లో.. లేకపోతే ఫామ్‌హౌస్‌లో ఉంటారని సెటైర్లు వేశారు.

దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పిన‌ కేసీఆర్, అదే దళిత బిడ్డను రాష్ట్రపతిని చేసిన ఘనత ప్రధాని మోదీది అని ఈటల అన్నారు.

ఇందిరా పార్క్ వద్ద మళ్లీ టెంట్లు మొదలయ్యాయని, తనను మించిన నాయకుడు లేడని కేసీఆర్ విర్రవీగుతున్నారని కానీ కేసీఆర్ వెన్ను ఆయనకు కనిపించడం లేదని.. అది ప్రజలకు కనిపిస్తోందన్నారు.

ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు మాత్రం రారు. దళితులకు ఇచ్చిన వేలాది ఎకరాల అసైన్‌మెంట్ భూములను కేసీఆర్ గుంజుకుంటున్నారని రాజేందర్ ఆరోపించారు.

ఫారెస్ట్ అధికారుల కాళ్ళ మీద నా గిరిజన బిడ్డలు పడాల్సిన దుస్థితి వచ్చింది. ఈ దుస్థితికి కారణమైన మిమ్మల్ని కర్రు కాల్చి వాత పెట్టే సమయం వచ్చింది. ఆనాడు అన్ని పార్టీల నాయకులు తెలంగాణ కోసం ఎలా కదిలి వచ్చారో.. ఇపుడు కేసీఆర్‌ను గద్దె దించడానికి అంతా ఏకమవుతున్నారు.

టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేరేందుకు కొందరు కీలక నేతలు చూస్తున్నారని ఈటల రాజేందర్ మరోసారి కామెంట్ చేశారు.ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి మేము కూడా బీజేపీలోకి వస్తామని అంటున్నార‌ని తెలిపారు.

Related posts