*యాదాద్రి నుంచి ప్రజా యాత్ర ప్రారంభం..
*తెలంగాణ పాలిట కేసీఆర్ శాపంగా మారారు..
*ఈడీ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు..
తెలంగాణ పాలిట ముఖ్యమంత్రి కేసీఆర్ శాపంగా మారారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజాసంగ్రామయాత్ర మూడో విడత మంగళవారం నాడు యాదాద్రి భువనగరి జిల్లాలో ప్రారంభించారు.
యాదాద్రి ఆలయం నుండి భద్రాద్రి ఆలయం వరకు యాత్ర కొనసాగనుంది. 27 రోజుల పాటు 328 కి.మీ పాటు పాదయాత్ర నిర్వహించనున్నారు బండి సంజయ్.ఈ యాత్ర ప్రారంభ సూచికంగా నిర్వహించిన సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు.
ఏడాది తర్వాత తెలంగాణలో ఎన్నికలు రానున్నాయని, అధికారులు కూడా చట్టపరంగా, న్యాయపరంగా వ్యవహరించాలని కిషన్ రెడ్డి సూచించారు. అధికారులు అతిగా వ్యవహరించవద్దని కూడా సుతిమెత్తగా హెచ్చరించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే అక్రమ కేసులు పెడుతున్న టీఆర్ఎస్ కు.. ఈడీ గురించి మాట్లాడే హక్కు ఉందా అని ప్రశ్నించారు.
ఏడాది తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మార్పు రానుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తే వారిపై అక్రమంగా కేసులు బనాయించడాన్ని కిషన్ రెడ్డి తప్పు బట్టారు.
మోదీ ఎనిమిదేళ్లలో ఒక్కరోజు కూడా ప్రధాని కార్యాలయానికి రాకుండా ఉండలేదన్నారు. కానీ కేసీఆర్ ఏ ఒక్కరోజూ సచివాలయానికి రాలేదన్నారు. ప్రజలను కలిసేందుకు కేసీఆర్ కు సమయం లేదన్నారు
కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం లేదన్న కిషన్ రెడ్డి.. కేంద్రానికి వ్యతిరేకంగా కుట్రలు చేసేందుకు మాత్రం టైం ఉంటుందని ఎద్దేవా చేశారు. కేజీ టూ పీజీ విద్య ఏమైందని మంత్రి నిలదీశారు. కేసీఆర్ పాలనకు తెలంగాణ ప్రజలు చరమ గీతం పాడుతారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన కేసీఆర్, ఎంఐఎం రాజ్యాంగాన్ని టీఆర్ఎస సర్కార్ అమలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.ఇతర రాష్ట్రాలకు వెళ్లి డబ్బులు పంపిణీ చేసేందుకు సమయం ఉంటుంది కాని, ఇక్కడ రైతులకు పరిహారాన్ని పంచేందుకు మాత్రం సమయం ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు సగం రోజులు మోదీని తిట్టడానికే సమయం సరిపోతుందన్నారు.
కేసీఆర్ కుర్చి పోయే కాలం వచ్చింది: కోమటిరెడ్డి